ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ యాగశాలలో అర్చకులు విష్వక్సేనపూజ, పుణ్యహవాచనము, అజాప్రదీపారాధన, వాస్తుపూజ, మృత్‌సంగ్రహణ, అలాగే వాస్తు హోమం, పవిత్ర శుద్ధిని జరిపారు. అనంతరం అంకురార్పణను నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంతక ముందు అర్చకులు, పండితులు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో పోశారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ నవధాన్యాలను పాలికల్లో ఉంచారు. దాంతో అంకురార్పణ కార్యక్రమం ముగిసింది. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయంగా వస్తోంది.
పంట కాలువకు గండి
ఇరగవరం: కాకిలేరు నుంచి కొయ్యేటిపాడు మీదుగా వెళ్లే రాపాక చానల్ పంట కాలువకు బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి గండి పడింది. దీంతో వర్షపు నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళన చెందారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా రాపాక చానెల్ నీరు నిలుపుదల చేసి గండి పూడ్చారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతలు పనులు పంచుకుని వేసవిలో కాలువ ఆధునికీకరణ పనులు నాసిరకంగా చేశారని, పర్యవేక్షించాల్సిన అధికారులు ఆలసత్వం వహించడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. దీనిపై మార్టేరు ఇరిగేషన్ జేఈ జై శంకర్‌ని వివరణ కోరగా కాలువను ఆధునీకరిస్తు ఉండగా రైతులు తమ దృష్టికి తీసుకురాకుండా తూర ఏర్పాటు చేసుకున్నారని, దాని చుట్టూ మట్టి నెరలు ఏర్పడ్డాయని, అవి ఇప్పుడు వర్షానికి కరిగిపోయి గండిగా ఏర్పడిందని, మరమ్మతులు చేసినట్లు చెప్పారు.

వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం