
స్నాతకోత్సవానికి నిట్ సిద్ధం
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్) ఏడవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీ ఉదయం నిట్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుకలో 2021–25 బ్యాచ్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. ముఖ్యఅతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రెసిడెంటు వి.రాజన్న హాజరవుతున్నారని ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్‌వీ.రమణరావు తెలిపారు. రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. 2015లో ఏపీ నిట్ ఏర్పాటుకాగా, ఇప్పటి వరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సును ఏడు బ్యాచ్‌ల విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. ఏడో స్నాతకోత్సవంలో 506 మంది బాలురు, 161 మంది బాలికలకు డిగ్రీలు పట్టాలు ప్రదానం చేస్తారు. వీరితో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసిన 29 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను అందచేయనున్నారు. సంస్థలో మొత్తం ఎనిమిది కోర్సులను నిర్వహిస్తుండగా ఆయా కోర్సుల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం ఎనిమిది మంది విద్యార్థులకు బంగారు పతకం అందిస్తారు. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిట్ అకడమిక్ డీన్ డాక్టర్ ఎన్.జయరామ్ తెలియచేశారు.
బంగారు పతకాలు అందుకొనేది వీరే
బయో టెక్నాలజీ – శశాంక్, కెమికల్ ఇంజనీరింగ్ –సంగెపు అభినవ్, సివిల్ ఇంజనీరింగ్ – తమ్ము హరిత, సీఎస్‌ఇ– కలిదిండి పవన్ తేజ సత్యవర్మ, ఈఈఈ– ఆదిత్య ప్రతాప్ సింగ్, ఈసీఇ– చిత్తిడి ధనుషాలక్ష్మి దుర్గ, మెకానికల్ ఇంజనీరింగ్ – వుడుమూడి ప్రియాంక, ఎంఎంఇ– జయస్మిత కే ప్రధాన్ బంగారు పతకాలు అందుకుంటారు. బ్యాచ్‌లో అత్యధిక గ్రేడ్‌పాయింట్లు సాధించిన కలిదిండి పవన్ తేజ సత్యవర్మ ఇనిస్టిట్యూట్ తరపున కోర్సు వారీగానే రెండు బంగారు పతకాలను అందుకోనున్నారు.