
ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
ఒకరి మృతి, బస్సు డ్రైవర్‌కు గాయాలు
భీమడోలు: పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెనపై బుధవారం ఆర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన కె.గణేష్ (28) కుటుంబ పోషణ నిమిత్తం నెల్లూరులోని ఓ రైస్ మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులను చూసేందుకు గణేష్, తులసి ప్రైవేటు ట్రావెల్ బస్సు టికెట్‌ను రిజర్వేషన్ చేయించుకున్నాడు. బుధవారం రాత్రి నెల్లూరు నుంచి అనకాపల్లికి బస్‌లో వెళ్తుండగా మార్గమధ్యమైన పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెన వద్దకు వచ్చేసరికి ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని నడుపుతూ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెనుక సీటులో కూర్చుని నిద్రిస్తున్న కె.గణేష్ రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కె.గణేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం దెబ్బతింది. ఈ బస్సులో 30 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే వారంతా బెంబేలెత్తిపోయారు. అదృష్టవశాత్తూ వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా
భీమవరం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులకు కోర్టు జరిమానా విధించినట్లు సీఐ జి కాళీచరణ్ చెప్పారు. భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, పద్మాలయ థియేటర్, బీవీ రాజు విగ్రహం ఏరియాల్లో మద్యం సేవించి వాహనాలు నడుతున్న ఆరుగుర్ని అరెస్ట్ చేసి భీమవరం, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న ముగ్గురికి రూ.500 చొప్పున జరిమానా విధించారని చెప్పారు.

ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ