
ఆంధ్రా చేపల సాగు అదుర్స్
జార్ఖండ్ ఆక్వా రైతుల కితాబు
కై కలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొల్లేరు ప్రాంతంలో ఆక్వా సాగు ఆచరణాత్మకంగా ఉందని జార్ఖండ్ రాష్ట్ర ఔత్సాహిక చేపల రైతులు కితాబిచ్చారు. మూడు రోజుల క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా కై కలూరు పరిసర ప్రాంతాల్లో రైతుల బృందం గురువారం పర్యటించింది. కై కలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి.రాజ్‌కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్.గణపతి ఆక్వా సాగు మెలకువలను రైతులకు వివరించారు. ఆటపాక గ్రామంలో ముదునూరి సీతారామరాజు చేపల చెరువును పరిశీలించి సాగు విధానాలను రైతుల నుంచి సేకరించారు. కై కలూరులో పలు ఆక్వా మందుల దుకాణాలను సందర్శించి చేపల సాగులో ఎదురవుతున్నా వ్యాధులు, ఎటువంటి మందులు వినియోగిస్తారు అనే విషయాలు నమోదు చేసుకున్నారు. అక్కడ నుంచి ఆచవరంలో చేపల ప్యాకింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. చివరిగా మండవల్లి మండలం కొర్లపాడులో కొరమేను చేపల సాగును పరిశీలించి రైతు నుంచి సాగు పద్ధతులు, పెట్టుబడి, కొరమేను విత్తనం, మార్కెట్‌లో రేటు, నీటి వనరులు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. బృందానికి నాయకత్వం వహించిన జార్ఖండ్ ఫిషరీష్ ఫిల్డ్ ఆఫీసర్ ప్రశాంత్‌కుమార్ దీపక్ మాట్లాడుతూ నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌ఎఫ్‌డీఏ), హైదరాబాదు సౌజన్యంతో జార్ఖండ్ ప్రభుత్వ మత్స్య, పశుసంవర్థక, కోఆపరేటివ్‌శాఖ ఆధ్వర్యంలో 15 మంది రైతులు బృందం వచ్చామన్నారు. ఇక్కడ సేకరించిన ఆక్వా సాగు పద్ధతులను జార్ఖండ్ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. శుక్రవారం కొల్లేరు ప్రాంతంలో మరింతగా చేపల సాగు పద్ధతులను తెలుసుకుని, శనివారం మచిలీపట్నం వెళతామన్నారు. కార్యక్రమంలో గ్రామ మత్స్యశాఖ సహాయకుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.