
కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం
జంగారెడ్డిగూడెం : కూటమి ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు, బీసీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పీపీఎన్ చంద్రరావు స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, పట్టణ వైఎస్సార్‌సీపీ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్‌లు పీపీఎన్‌చంద్రరావు, చిటికెల అచ్చిరాజు, చనమాల శ్రీనివాస్, బత్తిన చిన్న, భావన రుషి తదితరులు మాట్లాడారు. 50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం అందరికీ ఇవ్వలేదన్నారు. బీసీలను ఆకాశానికెత్తేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబు మరోసారి మోసం చేశారన్నారు. 2014లో కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదని, ప్రాధాన్యత సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, బీసీల్లో చేతివృత్తులకు రుణం ఇస్తామని మొండి చేయి చూపించారన్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా నిలకడలేని మనస్తత్వం అని, పొంతనలేని మాటలు మాట్లడతారని విమర్శించారు. ఈవీఎంల అక్రమాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 53 శాతం ఉన్న బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అంటే హత్యలు, అత్యాచారాలు, అవినీతి, అరాచకాలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. లోకేష్ మంగళగిరిలో చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.
పథకాల అమలు జగన్‌కే సాధ్యం
మాటిస్తే మడమ తిప్పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే పథకాలు అమలు సాధ్యమని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో బీసీలకు పట్టం కట్టారని, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్‌లు, ఎమ్మెల్సీలు ఆరుగురు, రాజ్యసభ సభ్యుల నలుగురికి పదవులు కల్పించారన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. చేనేత సొసైటీలకు నూలు, రంగులు సబ్సిడీపై ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్.వెంకటేశ్వరరావు, కేమిశెట్టి మల్లిబాబు, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, పెసరగంటి త్రిమూర్తులు, పెప్సీ శ్రీను, చిటికెల అచ్చిరాజు, ఆదినారాయణ, మాధవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.