డాక్యుమెంట్‌ రైటర్లదే హవా | - | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్‌ రైటర్లదే హవా

Aug 8 2025 7:42 AM | Updated on Aug 8 2025 7:42 AM

డాక్య

డాక్యుమెంట్‌ రైటర్లదే హవా

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వం డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను రద్దు చేసి ఏళ్లు గడుస్తున్నా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రం వీరిదే హవా నడుస్తోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వచ్చేవారి అవగాహన రాహిత్యం వీరికి ఆదాయ వనరుగా మారింది. దీనికితోడు కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ లు నామమాత్రంగా పనిచేస్తుండటంతో ‘రైటర్ల’ రాజ్యంగా మారింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై పూర్తిగా అవగాహన లేక 95 శాతం మంది వీరిపైనే ఆధారపడుతున్నారు. క్రయ, విక్రయాల్లో ఆస్తి విలువ ఆధారంగా వీరు సొమ్ములు వసూలు చేస్తున్నారు. 2002లో దస్తావేజు లేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అయినా లేఖర్లు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను వీడటంలేదు. అన్నీ తామై కార్యాలయా ల్లో రిజిస్ట్రేషన్‌ వ్యవహరాలు చక్కబెడుతున్నారు.

నామమాత్రంగా హెల్ప్‌డెస్క్‌లు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోని హెల్‌డెస్క్‌లు నామ మాత్రంగా పనిచేస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు అధిక సంఖ్యలో జరిగే కార్యాలయాల్లో పని ఒత్తిడి, సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నాయి.

ఉద్యోగులకు బెదిరింపులు

ఏలూరులో కొందరు పాత దస్తావేజు లేఖర్లు యూ నియన్‌గా ఏర్పడి రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఏలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు కనీసం 70 నుంచి 120 వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఇక్కడ జాయింట్‌–1 సబ్‌ రిజిస్ట్రార్‌, జాయింట్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌లు పనిచేస్తున్నారు. అయితే జాయింట్‌–1 సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవులో ఉండటంతో మిగిలిన సబ్‌ రిజిస్ట్రార్‌పై పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఒక దస్తావేజు లేఖరి గన్నవరంలో ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్‌ కోసం ఎనీవేర్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లో ఏలూరు కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆస్తికి సంబంధించిన క్రయ, విక్రయదా రులిద్దరూ గన్నవరానికి చెందిన వారు కావడంతో వారిని గన్నవరంలోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కార్యాలయ అధికారులు సూచించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్యుమెంట్‌ రైటర్‌ కొందరు విలేకరులను కార్యాలయానికి పిలిచి సబ్‌ రిజిస్ట్రార్‌పై ఫిర్యాదు కూడా చేశారు. అలాగే మరికొందరు డాక్యుమెంట్‌ రైటర్లు తమపై ఉన్నతాధికారులకు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారని, తాము వివరణ ఇవ్వాల్సి వస్తోందని కార్యాలయ ఉద్యోగులు అంటున్నారు.

చర్యలు తీసుకుంటాం

డాక్యుమెంట్‌ రైటర్లకు ప్రత్యేక గుర్తింపు లేదు. రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చే వారు ఎవ రైనా సాధారణ కక్షిదారులుగానే రావాలి. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందిపై బెదిరింపులకు, దాడులకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు కూడా నమోదు చేస్తాం. ఏలూరులో జరిగినట్టుగా చెబుతున్న సంఘటన నా దృష్టికి రాలేదు.

– కె.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్‌, ఏలూరు

అన్నీ తామై పనులు చేస్తున్న రైటర్లు

రిజిస్ట్రేషన్లకు రూ.వేలల్లో వసూళ్లు

కార్యాలయ ఉద్యోగులకు బెదిరింపులు

డాక్యుమెంట్‌ రైటర్లదే హవా 1
1/1

డాక్యుమెంట్‌ రైటర్లదే హవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement