
తిరగని రాట్నం
కూటమి పాలనలో చేనేత రంగానికి ప్రోత్సాహం కరువైంది. ఆదరణ లేక మగ్గాలు మూలకు చేరుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చంద్రబాబు సర్కారు నేతన్నల వైపు కన్నెత్తి చూసింది లేదు. నేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ ఇప్పుడు కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది.
సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు వేల వరకు చేనేత కుటుంబాలున్నాయి. పాలకొల్లు, అత్తిలి, యలమంచిలి, పెంటపాడు, పోడూరు, ఆచంట మండలాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. దివంగత వైఎస్ హయాంలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. నేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, రుణ మాఫీ, అధిక వడ్డీలతో కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీకే కొత్తగా రుణ సాయం, చిలపనూలుపై పదిశాతం సబ్సిడీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇళ్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాల ద్వారా చేనేత రంగాన్ని ఆయన ఆదుకున్నారు. తర్వాత పట్టించుకున్న వారు లేక సంక్షోభంలో కూరుకుపోయింది.
నేతన్నకు అండగా
తండ్రిని మించిన తనయునిగా చేనేత రంగానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. సొంత మగ్గం ఉన్న నేత కుటుంబాలకు వైఎస్సార్ నేతన్న నేస్తంగా నెలకు రూ. 2000 చొప్పున ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. గత ప్రభుత్వంలోని ఐదేళ్లలో ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో సరాసరి 1,063 కుటుంబాలకు రూ.12.76 కోట్ల లబ్ధి చేకూరింది. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో 920 కుటుంబాలకు రూ.10.96 కోట్లు, ఏలూరు జిల్లాలో 150 కుటుంబాలకు రూ. 1.8 కోట్ల సాయం అందించారు. అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ వైద్యం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ సాయం అందింది.
కంటి తుడుపు చర్యలే : గురువారం జాతీయ చేనేత దినోత్సవంగా సందర్భంగా చేనేతకు వరాల జల్లంటూ కూటమి ప్రచారం విమర్శలకు తావిస్తోంది. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు కంటితుడుపు చర్యలుగా కార్మికులు కొట్టిపారేస్తున్నారు. వీటివల్ల చేనేత రంగానికి ఒనగూరేదేమి లేదంటున్నారు. జిల్లాలో కేవలం 677 నేత మగ్గాలకు మాత్రమే ఈ సాయం పరిమితం కానుంది.
గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా అందించిన సాయం
పశ్చిమగోదావరి జిల్లా :
సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం
(రూ. కోట్లలో)
2019–20 854 రూ. 2.01
2020–21 1,067 రూ. 2.57
2021–22 779 రూ. 1.87
2022–23 839 రూ. 2.02
2023–24 1,027 రూ. 2.47
ఏలూరు జిల్లా
సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం
(రూ. లక్షల్లో)
2019–20 142 రూ. 34.10
2020–21 187 రూ. 44.90
2021–22 120 రూ. 28.80
2022–23 149 రూ. 35.76
2023–24 153 రూ. 36.72
ఏడాదిగా నేతన్నల వైపు కన్నెత్తి చూడని కూటమి ప్రభుత్వం
ప్రోత్సాహం లేక మూలకు చేరిన మగ్గాలు
గతంలోనూ చీర–ధోవతి హామీని అటకెక్కించిన చంద్రబాబు
నేతన్న నేస్తంతో అండగా నిలిచిన జగన్ సర్కారు
ఉమ్మడి జిల్లాలోని 1,070 కుటుంబాలకు రూ. 12.76 కోట్ల సాయం
నేడు జాతీయ చేనేత దినోత్సవం
చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే
చేనేత అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. చేనేత అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు. నేత కార్మికులను నిజంగా ప్రోత్సహించింది దివంగత వైఎస్సార్. తండ్రిని మించిన తనయుడిగా నేతన్న నేస్తం, సంక్షేమ పథకాలతో మాజీ సీఎం జగన్ నేత కార్మికులను ఆదుకున్నారు.
– వీరా మల్లిఖార్జునుడు, వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు, పాలకొల్లు
ఎన్నికల హామీలు అమలుచేయాలి
చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్ల నేత కార్మికులకు పెద్దగా మేలు జరిగేది లేదు. చేనేతను ప్రోత్సహించే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేయాలి. గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాలను అందజేయాలి.
నిల్లా బాలవీరయ్య,
చేనేత కార్మికుడు, శివపురం
మళ్లీ చిన్నచూపే
చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తామంటూ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ప్రతామ్నాయ ఉపాధి చూసుకోవాలని నేతన్నలను చిన్నచూపు చూశారు. కూటమి ప్రభుత్వంలోనూ అదే తీరుగా ఉన్నారన్న విమర్శలున్నాయి. ఏడాదిగా ప్రోత్సాహం కరువై చేనేత కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మగ్గాలకు స్వస్తి చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది కార్మికులు నేత పని వీడి వ్యవసాయ కూలీలుగా, ఇతర పనుల్లోకి వెళ్లిపోతున్నారు. ఏడాది క్రితం ఉమ్మడి జిల్లాలో 1187 మగ్గాలు ఉండగా ప్రస్తుతం 677కు తగ్గిపోయినట్టు తెలుస్తోంది.

తిరగని రాట్నం

తిరగని రాట్నం