
ఉంగుటూరు కూటమిలో కుంపట్లు
నీకు సగం.. నాకు సగం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పైకి ఆప్యాయంగా పలకరించుకుని కౌగిలించుకుంటారు.. లోపల మాత్రం కత్తులు దూస్తారు. ఎమ్మెల్యే అధికారిక హోదాలో ఒక కార్యక్రమం చేస్తే.. ఆప్కాబ్ చైర్మన్ ప్రొటోకాల్ హోదాతో మరో కార్యక్రమం నిర్వహిస్తారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు హడావుడి చేస్తుంటే.. పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మరో కార్యక్రమానికి తెరతీసి పోటాపోటీగా హడావుడి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సమాంతరంగా హడావుడితో పార్టీ కేడర్ మొదలుకొని అధికారుల వరకు ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నారు. నిత్యం కూటమిలోని జనసేన, టీడీపీ నేతల మధ్య అసంతృప్తి, అసహనాలతో ఉంగుటూరు రాజకీయం వేడెక్కుతోంది.
ఎమ్మెల్యేతో చనువుగా ఉంటే వేటే..
పైకి ప్రేమగా కనిపించినా.. లోపల మాత్రం ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో బలపడితే భవిష్యత్‌లో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందనే రీతిలో గన్ని చెక్ పెడుతూ వస్తున్నారు. ఆప్కాబ్ చైర్మన్ పదవి రావడంతో మరింత వేగం పెంచి నియోజకవర్గంలో మండలాల్లో పెత్తనం సాగించడంతో పాటు ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగే టీడీపీ నేతలపై వేటు కొనసాగిస్తున్నారు. ఉంగుటూరు మండల అధ్యక్షుడు పాతూరి విజయ్‌కుమార్ ఎన్నికల సమయంలో ధర్మరాజుకు సహకరించారనే కారణంతో మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎన్నికల ప్రచార సమయంలోనే నారాయణపురంలో విజయ్‌కుమార్‌పై టీడీపీ వ్యక్తులే దాడి చేయడం గమనార్హం. భీమడోలు మండల అధ్యక్ష పదవిని సీనియర్లను కాదని నామినేట్ పదవి ఉన్న వ్యక్తికే కేటాయించడంపైన టీడీపీ కేడర్ రగులుతున్నారు. ఖర్చుతో కూడిన భీమడోలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తొలుత బీసీ మహిళకు కేటాయించారు. గన్ని వీరాంజనేయులు బీసీ మహిళ నుంచి దాన్ని బీసీ జనరల్ చేసి తన వర్గానికి చెందిన శేషగిరికి దక్కేలా చేశారు. మార్కెట్ యార్డుకు స్థానిక ప్రజాప్రతినిధి గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేను పిలవకపోవడం వివాదమైంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి గన్ని హడావిడి చేస్తున్నారు. మరోవైపు పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసుకుని ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపుతో టచ్‌లో ఉండే సీనియర్ నేతలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేలా గన్ని వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసే దిశగా అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు.
జనసేన ఎమ్మెల్యే వర్సెస్ ఆప్కాబ్ చైర్మన్
సుపరిపాలన తొలి అడుగు పేరుతో గన్ని హడావుడి
పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం
ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే టీడీపీ నేతలపై గన్ని వేటు
గన్ని తీరుపై టీడీపీలో రగులుతున్న అసంతృప్తి
ఉంగుటూరులో జనసేన వర్సెస్ టీడీపీ రగడ తారాస్థాయికి చేరింది. నిన్న మొన్నటి వరకు పనులు, పంపకాలు పర్సంటేజీల మధ్య చాప కింద నీరులా కొనసాగిన అంతర్యుద్ధం నేడు ప్రొటోకాల్ వ్యవహారాలకు పాకింది. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను కాదని జనసేన ఇన్‌చార్జి ధర్మరాజుకు టిక్కెట్ కేటాయించడం, ఎన్నికల్లో ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో రగడకు తెరలేచింది. టీడీపీకే ఉంగుటూరు టిక్కెట్ ఇవ్వాలని ఎన్నికలకు ముందు గన్ని వర్గం భారీ ర్యాలీతో టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హడావుడి చేసింది. టీడీపీ అధిష్టానం గట్టిగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయి పెత్తనం కోసం హడావుడి మొదలైంది. నీకు సగం.. నాకు సగమంటూ పంచాయితీలకు తెరతీశారు. నామినేట్ పదవులు, వర్క్‌లు, మద్యం షాపుల ఇలా అన్నింటిని పంపకాలు చేసేలా టీడీపీ కీలక నేతలు ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలో ప్రతి దాంట్లో గన్నికి వాటాలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు నియోజకవర్గంలో 17 సొసైటీలు ఉంటే 8 జనసేన, 8 టీడీపీ, 1 బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి సొసైటీ చైర్మన్లుగా ఎంపికై న వారికి చాలా ఖర్చయిందనేది నియోజకవర్గంలో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం.