
మూల్యాంకన పుస్తకాలపై వ్యతిరేకత
ఇప్పటికే విద్యాశక్తిని బహిష్కరించిన ఉపాధ్యాయులు
నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ ద్వారా పాఠశాలలకు పంపిన మూల్యాకంన పుస్తకాలపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న పనులను చేయడానికే ఎక్కువ సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకన పుస్తకం ఇచ్చింది. దీంతో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఆరు మూల్యాంకన పుస్తకాలు ఇవ్వగా, ఫార్మేటివ్ అసిస్‌మెంట్, సమ్మేటివ్ అసిస్‌మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులతో రాయించాలి. విద్యార్థులు రాసిన తరువాత పరీక్షలను దిద్ది అందులోనే ఇచ్చిన ఓఎమ్మార్ షీట్‌లో మార్కులు వేయడంతో పాటు వారి పరీక్ష రాసిన పేజీలను స్కాన్ చేసి విద్యాశాఖ ఇచ్చిన యాప్‌లో ఆప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసేటప్పుడు సర్వర్ బిజీగా ఉన్నా, నెట్ స్లోగా ఉన్నా అప్‌లోడ్ చేయడం తీవ్ర జాప్యమయ్యే అవకాశాలున్నాయి.
బడిలో దిద్దడానికి సమయమేది : గతంలో విద్యార్థి రాసిన పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులు వారి వెసులుబాటును బట్టి బడిలో దిద్దేవారు. సమయం సరిపోకపోతే ఇళ్లకు తీసుకెళ్లి పేపర్లు దిద్దుకొని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి మోసుకొని వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులుంటే వారందరి మూల్యాకనం పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి దిద్దడానికి వీలవ్వదు. బడిలోనే దిద్ది ప్రతి సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఒక్కొక్క విద్యార్ధి మూడు పేజీలు రాస్తే వంద నుంచి 120 పేజీలను ఒక సబ్జెక్టుకు స్కాన్ చేయాల్సి ఉంటుంది. హైస్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడు నాలుగు తరగతులకు వెళ్లినట్లయితే వారం రోజుల పాటు ఇదే పనిని చేస్తే పూర్తవుతుంది. ఇంత చేసినా విద్యార్థికి ఒనగూడే ప్రయోజనం శూన్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మూల్యాంకనం పుస్తకాలను ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడు భద్రపరుచుకోవాలి.
విద్యాశక్తి నిర్బంధంగా అమలు
హైస్కూళ్లలో సాయంత్రం 4 గంటల తరువాత విద్యాశక్తి కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తోంది. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యాశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఇది ఉపాధ్యాయులకు కొత్త తలనొప్పిలా మారింది. ఉపాధ్యాయ సంఘాలు అడిగినప్పుడు నిర్భంధం కాదని చెబుతున్న ఉన్నతాధికారులు ఆ తరువాత ఉపాధ్యాయులపై మండల స్థాయి అధికారులతో మేం వస్తున్నాం.. తనిఖీ చేస్తాం.. అంటూ ఒత్తిడి చేస్తూ పనిచేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయులు గత రెండు రోజులుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఈవోలకు వినతిపత్రాలను సైతం అందజేస్తున్నారు. ప్రశాంతంగా సాగాల్సిన విద్యారంగ కార్యక్రమాలను హడావుడిగా మార్చేసి తీవ్ర ఒత్తిడికి గురయ్యేలా ప్రభుత్వం చేస్తుండటంతో ఎంతో మంది ఉపాధ్యాయులు నేడు అనారోగ్యం పాలవుతున్నారనే ఆందోళన ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది.