ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోన్ –2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సునీల్ కుమార్‌ను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
టీడీపీ గూండాల దాడి హేయం
భీమడోలు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, నాయకులపై పులివెందులలో టీడీపీ గుండాలు చేసిన దాడి అత్యంత హేయమని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ ఓ పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తెగబడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీలో పెదబాబు, చినబాబుకు భయం పట్టుకుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డుపైకి వస్తే చాలు టీడీపీకి భయమని, అందుకే పార్టీ శ్రేణులపై పచ్చ గుండాలు దాడులు చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దాడి చేసిన గుండాలను కఠినంగా శిక్షించాలని కోరారు. దాడికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.
అనుబంధ కమిటీలనియామకానికి చర్యలు
బుట్టాయగూడెం: జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ అనుబంధ కమిటీల నియామకం పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అనుబంధ విభాగాల ఇన్‌చార్జి కొలుసు మోహన్‌యాదవ్ తెలిపారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మిలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి అనుబంధ విభాగాల్లో నియమితులైన నాయకులు కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎస్‌ఎస్‌సీ పరీక్షల పరిశీలన
దెందులూరు: వేగవరం హేలాపురి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జరుగుతున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫ్ పరీక్షలను ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ పరిశీలించారు. బుధవారం వేగవరం కళాశాలను ఆయన పరిశీలించారు.
విద్యాసంస్థల బస్సులపై కేసుల నమోదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు బుధవారం విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 15 కేసులు నమోదు చేసి, రూ.26 వేలు జరిమానా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. వాహనదారులు లైసెనన్స్‌తో పాటు సంబంధిత వాహన పత్రాలను ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. విద్యార్థులను తరలించే విషయములో నిబంధనలను పాటించని విద్యాసంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

అనుబంధ కమిటీలనియామకానికి చర్యలు

యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కారుమూరి సునీల్