
సీతారాముని ఆలయంలో చోరీ
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని శ్రీసీతారామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులోని సీతారామస్వామి ఆలయ తలుపులు తెరిచేందుకు మంగళవారం ఉదయం అర్చకులు శ్రీనివాసులు వెళ్లగా తలుపులు తాళాలు పగులగొట్టి ఉండడం, సీసీ కెమెరాలు ధ్వంసం కావడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. హుండీ కోసం వెతకగా ఆలయానికి ఆనుకుని కున్న ఎంపీయూపీ పాఠశాల ఆవరణలో లభించింది. అలాగే పాఠశాలలోని పలు గదుల తాళాలు సైతం పగులగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని ఎస్సై జబీర్ పరిశీలించారు. ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ మంగళవారం ఫిర్యాదుచేశారు. కాగా, చోరీ చేసిన హుండీపై వేలి ముద్రలు పడకుండా దొంగలు కోడిగుడ్లు పగులగొట్టి వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ వాచ్‌మన్‌ను ఈవో తన వాహనానికి డ్రైవర్‌గా వినియోగించుకోవడంతో సోమవారం రాత్రి అతడు విధులకు హాజరు కాలేదని తెలిసింది.
ద్విచక్ర వాహనాల చోరీపై ఫిర్యాదు
ఉండి: రెండు ద్విచక్ర వాహనాల చోరీపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోడూరు మండలం జగన్నాధపురానికి చెందిన కడలి బాబీ జూన్ 10వ తేదీన మహదేవపట్నలో రొయ్యల పట్టుబడికి వచ్చాడు. పని ముగించుకుని మద్యం దుకాణం వద్ద వాహనాన్ని నిలిపి లోనికి వెళ్లి బయటకు వచ్చేసరికి ద్విచక్రవాహనం కనిపించలేదు. ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై హెడ్‌కానిష్టేబుల్ కేసు నమోదు చేశారు. అలాగే పెదపుల్లేరులో గత నెల 19వ తేదీ రాత్రి నిచ్చెనకొలను కృష్ణ తన ఇంటివద్ద ద్విచక్రవాహాన్ని పెట్టాడు. మరోసటి రోజు ఉదయానికి వాహనం కనిపించలేదు. ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.