
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐజేయూ నాయకుడు జీవీఎస్‌ఎన్ రాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్ కే.వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కొత్త అక్రిడిటేషన్లు విడుదల చేయకుండా, పాత అక్రిడిటేషన్ల గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారన్నారు. వెంటనే అర్హత ఉన్న జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలని, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి స్పందిస్తూ జర్నలిస్టుల డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి టైమ్స్ కిషోర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.సంజయ్‌కుమార్, శీర శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు షేక్ రియాజ్, ఉర్ల శ్రీనివాస్, సీహెచ్ రామకృష్ణరాజు, డీ.విజయ్ కుమార్, శ్రీధర్, పోతురాజు, బ్రహ్మయ్య, కే.రత్నకుమారి, వాసు తదితరులు పాల్గొన్నారు.