
వైభవంగా శ్రీవారికి ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు.
నేడు ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక
భీమవరం: పట్టణంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్లో ఈనెల 6వ తేదీన జిల్లా స్థాయి ఆట్యా–పాట్యా జూనియర్ బాలురు, బాలికల సెలక్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆట్యా–పాట్యా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్‌వర్మ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9, 10 తేదీల్లో ఒంగోలులో జరిగే 10వ జూనియర్ రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికకు జనవరి 1, 2008 తరువాత పుట్టినవారు అర్హులని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేది ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలతో హాజరుకావాలన్నారు.