
విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి
తణుకు అర్బన్: విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన మంగళవారం తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన పిప్పిరిశెట్టి మణికంఠ (24) కొమరవరం గ్రామంలోని లక్ష్మీ గణేష్ నగర్‌లో ఒక ఇంట్లో విద్యుత్ లైన్‌ల పనుల్లో ఉండగా తెగిపడి ఉన్న విద్యుత్ వైరు గమనించకుండా తాకడంతో అతడికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో గాయాలపాలైన మణికంఠను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తణుకు పట్టణానికి చెందిన బిల్డర్ వాసుకూరి వెంకట సుబ్బారావు నిర్మిస్తున్న భవనానికి సంబంధించి ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ పనుల నిమిత్తం చివటం గ్రామానికి చెందిన కోలా ప్రసాద్ అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అతని వద్ద పనిచేస్తున్న మణికంఠ విధుల్లో ఉండగా విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం కేసులో వ్యక్తి అరెస్ట్
భీమవరం: పాతమద్యం కేసులో ఎండీపీఎల్ ముద్దాయి కాకినాడ జిల్లా తుని పట్టణం సీతారాంపురానికి చెందిన వీర్ల దుర్గా ప్రసాద్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు చెప్పారు. అతడిని ఫస్ట్ ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చగా నరసా పురం సబ్‌జైల్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.