
వివాదాస్పదంగా ఈవో తీరు
జంగారెడ్డిగూడెం: ఆలయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దేవదాయ శాఖ కార్యనిర్వాహక అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్‌లో ఉన్న రామాలయానికి స్థానిక సుబ్బంపేటలో 33.65 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే ఆ భూమిని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సదరు భూమిలో ఉన్న ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ఈవో కలగర శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్లారు. ఆలయాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులతో ఆలయ తాళాలు ఇవ్వాలని కోరారు. దీనికి వారు ఆలయంలో తమకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని, వాటిని తీసుకున్న తరువాత మీకు అప్పగిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులతో ఈవో దురుసుగా వ్యవహరిస్తూ మాట్లాడటంతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆలయాన్ని ఎందుకు అప్పగించరు; వ్యాపారాలు చేసుకుందామనా.. అంటూ ఈవో మాట్లాడటంతో ఆలయ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. పారిజాతగిరి ఈవోగా వ్యవహరిస్తున్న కలగర శ్రీనివాస్ జంగారెడ్డిగూడెం మండలంలోని 25 ఆలయాలకు ఇన్‌చార్జిగా వ్యవమరిస్తున్నారు. పలు ఆలయాల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రేడ్–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్–2 అధికారికి ఎలా బాధ్యతలు అప్పగించారో ఉన్నతాధికారులే చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు. గ్రేడ్–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్–2 అధికారి ఈవోగా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈవో శ్రీనివాస్ దేవదాయ శాఖలో చేరిన సంవత్సరం, ఎస్‌ఆర్‌లో నమోదు చేసిన సంవత్సరంలో కూడా తేడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయం స్వాధీనానికి వెళ్లగా.. దానిని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండగా అడ్డుకున్నానని, దాని వల్లే తనను అల్లరి చేస్తున్నారని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు.