
లైంగిక వేధింపుల నుంచి రక్షణకు కృషిచేయాలి
భీమడోలు: లైంగిక వేఽధింపుల నుంచి మహిళళల రక్షణకు ఏర్పాటు చేసిన కమిటీలు తమ వంతు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. భీమడోలు మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సదస్సును నిర్వహించారు. కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఉచిత న్యాయ సహాయాన్ని, బాధితులకు తాత్కాలిక, శాశ్వత పరిహారాన్ని అందిస్తాయన్నారు. జిల్లా బాలికా సంరక్షణాధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని, అలా చేసే వారిని చట్టం తీవ్రంగా శిక్షిస్తుందన్నారు. మహిళలకు అనేక చట్టాలున్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే రక్షణ పొందుతారన్నారు. పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సందర్శించి కళాశాలలోని వసతులు, పరిసరాలను పరిశీలించారు.