
డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు?
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల్లో సగం మందికి పైగా ఇంజనీరింగ్ వైపు దృష్టి సారించగా.. మిగిలిన సగం మందికి డిగ్రీ విద్య ప్రత్యామ్నాయం. డిగ్రీలో సైతం పలు సాంకేతిక కోర్సులతో పాటు ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 50 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ కోర్సులు పూర్తిచేసి సివిల్స్, సర్వీస్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వేలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉండటంతో ఈ కోర్సులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకూ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు.
ఫలితాలు వచ్చి నాలుగు నెలలు
ప్రభుత్వం ఇంటర్మీడియెట్ ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించి జూన్ 7న ఫలితాలు విడుదల చేసింది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ముగిసి విద్యార్థులు తమకు సీటు వచ్చిన కళాశాలల్లో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకూ రిపోర్టు చేయనున్నారు. తమతో పాటు ఇంటర్మీడియెట్ రాసిన మిత్రుల్లో కొందరు ఇంజనీరింగ్ విద్యకు వెళ్లడం, వారు మరో మూడు, నాలుగు రోజుల్లో తరగతులకు హాజరయ్యే పరిస్థితి ఉంది. వారితో పాటే ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కోర్సుల్లో చేరుదామని ఎదురుచూస్తున్న విద్యార్థులకు మాత్రం ఇప్పటివరకూ నోటిఫికేషనే ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం డిగ్రీ విద్యను ఎంతటా నిర్లక్ష్యం చేస్తోందో అర్థమవుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.
91 కాలేజీలు.. 60 వేల సీట్లు
ఏలూరు జిల్లాలో 40, పశ్చిమగోదావరి జిల్లాలో 51 డిగ్రీ కళాశాలు ఉన్నాయి. వివిధ గ్రూపుల్లో సుమా రు 60 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్థుల జీవితాలతో ఆటలా..
డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వం
ఇంటర్ ఫలితాలు వచ్చి దాదాపు 4 నెలలు
డిగ్రీ ప్రవేశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు
ఏలూరు, పశ్చిమలో 91 కళాశాలలు
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ఇప్పటికే పలు అసంబద్ధ నిర్ణయాలతో పాఠశాల విద్యను అటకెక్కించారు. ఇప్పుడు డిగ్రీ విద్యను కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఇంటర్ ఫలితాలు వెల్లడై దాదాపు 100 రోజులు కావస్తోంది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచిపోతోంది. డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు చేపడతారు. రెండు నెలల పాటు విద్యకు దూరంగా విద్యార్థులు ఉన్నారు. వారి భవిష్యత్‌తో ఆటలాడటం ప్రభుత్వానికి తగదు.
– కాకి నాని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
ఎదురుచూపులు
డిగ్రీలో ఏఏ కోర్సులతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ కోర్సులు తేలికగా పూర్తి చేసి, పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు వచ్చే కోర్సులు ఏమిటి అనే విషయాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికే తమకు తెలిసిన విద్యాధికులను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఇంటర్మీడియెట్ ఫలితాలు వెలువడిన నెలలోపే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ఆరంభం నాటికి విద్యార్థులంతా కళాశాలలకు వెళ్లే ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ దిశగా ఏ చర్యా తీసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
డిగ్రీ కళాశాలలు
ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి
ప్రభుత్వ 7 4
ప్రభుత్వ అటానమస్ – 2
ప్రభుత్వ ఎయిడెడ్ అటానమస్ 1 4
ప్రైవేట్ అటానమస్ 1 1
ప్రైవేట్ ఎయిడెడ్ – 1
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 31 39
మొత్తం 40 51

డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు?