
అత్యవసర వైద్యం.. అందని దైనం
ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆస్పత్రిలో (జీజీహెచ్)లో అత్యవసర వైద్యం అందనంత దూరంలో ఉంది. ముఖ్యంగా గర్భిణులు ప్రసూతి కోసం వస్తే గైనిక్ విభాగంలో వారి పరిస్థితి దయనీయంగా మా రింది. అలాగే ఆస్పత్రిలో గర్భిణులు, కడుపు నొప్పి తో బాధపడుతూ వచ్చే మహిళలకు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసేందుకు రెగ్యులర్ టెక్నీషియన్లు లేరు. పీజీ వైద్య విద్యార్థినులు కొందరు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్కానింగ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ కేంద్రాల్లో స్కానింగ్ తీయించుకోవాల్సి వస్తుందని రోగుల బంధువులు అంటున్నారు.
‘గుండె’కు రక్షణ లేదు
జీజీహెచ్‌కు గుండెపోటుతో ఎవరైనా వెళితే ప్రాణాలకు గ్యారెంటీ లేదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులను బదిలీలు చేయటంతో గుండె వ్యాధి నిపుణులు లేకుండా పోయా రు. గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షలను సైతం ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టారు. ఈ ఏజెన్సీకి చెందిన టెక్నీషియన్లు వారానికి మూడు రోజులు ఏలూరు జీజీహెచ్‌లో 2డీ ఏకో స్కాన్ పరీక్షలు చేయాల్సి ఉండగా సోమవారం మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో మిగిలిన రోజుల్లో రోగుల పరిస్థితి దైన్యంగా మారింది. ప్రైవేట్ ఏజెన్సీలో టెక్నీషియన్లు, వైద్యు లు రోగులకు పరీక్షలు చేస్తూ విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారని, ఇలా రిఫర్ చేయటం ద్వారా ఏజెన్సీ సిబ్బందికి గుండె ఆపరేషన్లు, ఇతర చికిత్సల్లో వాటాలు వస్తున్నాయ నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అత్యవసర మందులు అందుబాటులో ఉండటం లేదు.
‘ట్రామా కేర్’లెస్
అత్యవసర సేవల్లో భాగంగా న్యూరో విభాగంలో ఒక వైద్యుడు మాత్రమే పనిచేస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర వైద్య చికిత్సలు పూర్తిస్థాయిలో అందడం లేదు. అలాగే ట్రామా కేర్ వైద్య నిపుణులు లేరు.
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఉందా!
జీజీహెచ్ అభివృద్ధి కమిటీ ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ, ఏలూరు ఎంపీ, దెందులూరు, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నా ఉపయోగం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తూతూమంత్రంగా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆదేశాలు జారీ చేసినా జీజీహెచ్ అధికారులు, సిబ్బంది వాటిని పట్టించుకోవటం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఏలూరు జిల్లా ఆస్పత్రి, బోధనాస్పత్రిగా అభివృద్ధి చేస్తే నేడు కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్‌లో ప్రసూతికి వచ్చింది. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే కుట్లు సరిగా వేయకపోవటంతో ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత ఇన్ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇదేంటని ఆస్పత్రి వైద్యులను ప్రశ్నించినా పట్టించుకునే నాథుడే లేడు. ఇదే తరహాలో ప్రసూతి కోసం వచ్చే గర్భిణులు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏలూరుకి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ జీజీహెచ్‌కు వచ్చారు. రాత్రి వేళ కావడంతో ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు విజయవాడ రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చేసేది లేక ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పేద, మద్యతరగతి వర్గాలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రాణాలు గాల్లో దీపమే అని బాధితులు వాపోతున్నారు.
ఏలూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు నిల్
ఒక్కరోజు మాత్రమే ఏకో పరీక్షలు
వైద్య నిపుణుల కొరత