
సీఎస్‌సీ భవన నిర్మాణానికి చర్యలు
కాళ్ల : మండలంలోని బొండాడ గ్రామంలో సచివాలయం వద్ద రూ.లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రైవేట్ వ్యక్తులు కూ ల్చివేయడంతో అధికారులు తప్పును సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. సచివాలయ భవనం ప్రారంభం కాకుండానే మరుగుదొడ్లను కూల్చివేయడంపై గత నెల 27న ‘సాక్షి’లో ప్రచురించిన ‘ప్రభుత్వ భవనాలకే రక్షణ లేదు’ కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎవరైతే భవనాన్ని కూల్చారో వారే కట్టించేలా చూడాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శితో పాటు అధికారులపై డిప్యూటీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కూల్చిన వ్యక్తితోనే భవనాన్ని కట్టిస్తున్నారు. ఆదివారం సీఎస్‌సీ భవనం (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) నిర్మాణానికి ఇంజనీరింగ్ సిబ్బంది మార్కింగ్ వేశారు. మెటీరియల్ సిద్ధం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ఫణి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

సీఎస్‌సీ భవన నిర్మాణానికి చర్యలు