
5న స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ధర్నాలు
దెందులూరు: ప్రజలపై భారాలు మోపేలా కూటమి ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగిస్తోందని, దీనిని వ్యతిరేకిస్తూ మండల కేంద్రాలు, విద్యుత్ కార్యాలయాల వద్ద ఈనెల 5న ప్రజావేదిక ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాడు స్మార్ట్ మీటర్లను పగులకొట్టాలని పి లుపునిచ్చిన కూటమి నాయకులు.. నేడు మీటర్లను బిగించాలని ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమే అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.15,485 కోట్ల సర్దుబాటు చా ర్జీల భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో దుకాణాలు, చిన్న పరిశ్రమలకు 10 రెట్ల విద్యుత్ చార్జీలు పెరిగాయన్నారు. అలాగే మీటర్ ఖర్చులను (రూ.10 వేల నుంచి రూ.17 వేలు) దశల వారీగా వినియోగదారులపై మోపడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత మీటర్లనే కొనసాగిస్తూ, పాత రీడింగ్ పద్ధతినే అమలు చేయాలని శ్రీనివాస్ కోరారు.