నీరందక ఆక్వా రైతు విలవిల | - | Sakshi
Sakshi News home page

నీరందక ఆక్వా రైతు విలవిల

Aug 4 2025 3:35 AM | Updated on Aug 4 2025 3:35 AM

నీరంద

నీరందక ఆక్వా రైతు విలవిల

భీమడోలు: ఆగడాలలంక చానల్‌ పరిధిలోని ఆక్వా చెరువులకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. 7 వేల ఎకరాల ఆక్వా ఆయుకట్టులోని చేపల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో నీరందించకపోవడంతో చేపలు, చేపల పిల్లలు మృత్యువాత పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. మురుగునీటిని చెరువుల్లో నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి కాలువలో నీటి లెవెల్స్‌ ఎక్కువగా ఉన్నందున రెండు అడుగుల మేర నీటిని విడుదల చేయాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

చానల్‌ పరిధిలో భోగాపురం, వడ్డిగూడెం, లక్ష్మీపురం, సీతారామనగరం, ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరంతో పాటు ఏలూరు రూరల్‌ మండలానికి చెందిన పలు గ్రామాలకు మంచినీరు, సాగునీరు అందిస్తారు. చానల్‌లో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కతో నీరు కిందకు పారడం లేదు. ఈ సమయంలో అడుగు లోపు నీరందించడం వల్ల శివారుకు నీరు చేరడం లేదు. మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. నెలకు 10 రోజుల మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేక రైతులు కాల్వ నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. నీరు లేకపోవడంతో చేప పిల్లలు బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.33 లక్షల నీటి తీరువా వసూలు చేశారు

అర అడుగు నీటి వల్ల వరి రైతులు, ఆక్వా రైతులకు ప్రయోజనం లేదని చెట్టున్నపాడు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆర్‌. రామకృష్ణం రాజు విమర్శించారు. గ్రామాల్లోని మంచినీటి చెరువులకు నీటిని తోడుకోవాల్సి ఉందని, ఇరిగేషన్‌ అధికారులు నీటిని పూర్తి స్థాయిలో అందించడం లేదన్నారు. సార్వా నాట్లు పూర్తయినా నీటి వినియోగం తగ్గినా ఆక్వా చెరువులకు నీరివ్వడం లేదని, నీటి తీరువా కింద రూ.33 లక్షలు రైతులు ప్రభుత్వానికి చెల్లించారని చెప్పారు.

శివారుకు చేరని ఆగడాలలంక చానల్‌ నీరు

నీటిని విడుదల చేస్తున్నాం

గోదావరి కాల్వలో నీటి లభ్యత ఆధారంగా నీరిందిస్తున్నాం. వరి సాగు, మంచినీటి అవసరాలు తీర్చిన తర్వాతనే ఆక్వాకు నీరందిస్తాం. మంచినీటి చెరువులన్నీ నింపాం. వరి పొలాలకు నీరందించాం. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మెరక తూములకు నీరందక రైతులు, ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ నీటిని సరఫరా చేస్తున్నాం. గుండుగొలను వద్ద నీటి మట్టం 4.6 అడుగుల వరకూ ఉంది. ఆగడాలలంక చానల్‌కు రెండు అడుగుల నీటిని విడుదల చేస్తే... గోదావరి కాల్వ ఆయకట్టుపై ప్రభావం పడుతుంది.

సుబ్రహ్మణ్యం, ఏఈ, ఇరిగేషన్‌ సెక్షన్‌, గుండుగొలను

నీరందక ఆక్వా రైతు విలవిల 1
1/1

నీరందక ఆక్వా రైతు విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement