
పాపికొండల్లో అడవి దున్నలు
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో అడవి దున్నల ఉనికిని గుర్తించారు. సింహాలు, పులులు, ఏనుగులను సైతం తరిమి కొట్టే సత్తా ఉన్న జంతువులు ఈ అడవిదున్నలు. అభయారణ్య పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. సుమారు 10 నుంచి 20 వరకూ గుంపులుగా ఈ అడవి దున్నలు మేత కోసం తిరుగుతూ ఉంటాయి. వైల్డ్ లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు ఈ అడవి దున్నలు చిక్కాయి. మొత్తం 420 పైగా అడవి దున్నలు పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అడవుల్లోని గడ్డితోపాటు లేత వెదురు చిగుళ్లను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. రాత్రి, పగలు కూడా దురుసుగా తల ఎగరేస్తూ సంచరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. అడవి దున్నల దాడుల్లో అనేక మంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అడవి దున్నలు భారత ఉపఖండంలోని భారత్, బంగ్లాదేశ్, నేపాల్‌లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు. మన దేశంలో పశ్చిమ కనుమలు, దండకారణ్యాల్లో వీటి ఉనికి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం అటవీ ప్రాంతం, పాపికొండల అభయారణ్యంలోనూ అడవి దున్నల సంచారం అత్యధికంగా ఉంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అడవి దున్నల సంచారం క్రమేపీ అంతరించిపోవడం వల్ల అక్కడ వీటి సంచారంలేదని అధికారులు అంటున్నారు.
వన్యప్రాణుల కోసం గడ్డి పెంపకం
పాపికొండల అభయారణ్యం పరిధిలో సుమారు 15 హెక్టారుల్లో వన్యప్రాణుల కోసం వైల్డ్ లైఫ్ అధికారులు గడ్డి పంటను పండిస్తున్నారు. ఈ పంట ముఖ్యంగా అడవి దున్నలు, కుందేళ్లు వంటి శాఖాహార జంతువులు తినేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు అంటున్నారు.
పులిని సైతం మట్టికరిపించే దున్న
ఆరున్నర అడుగుల ఎత్తు.. 12 అడుగుల పొడవు, 800 నుంచి 1500 కేజీల భారీ బరువుతో అడవి దున్నలు ఉంటాయి. పెద్ద పులులను సైతం మట్టి కరిపించే వణ్యప్రాణి అడవిదున్న. దీని జీవిత కాలం 15 నుంచి 20 సంవత్సరాల వరకూ ఉంటుంది.
రాత్రి, పగలు తేడా లేకుండా దురుసుగా తిరిగే జంతువు
మనుషులు కనిపిస్తే దాడిచేసే ప్రమాదం

పాపికొండల్లో అడవి దున్నలు