
22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈనెల 22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ఉదయం 9.30 గంటల నుంచి జరిగే ఈ వేడుకలో పాల్గొనాలని ఆయన కోరారు.
చిన్న తిరుపతిలో
కిటకిటలాడిన భక్తులు
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో పాటు, శ్రావణమాస పర్వదినాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలో సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధికంగా మంగమ్మతల్లి దర్శనానికి రావడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు.

22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు