
భీమవరం మున్సిపాలిటీలో అవినీతి భాగోతం
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వంలో భీమవరం మున్సిపాలిటీ అవినీతి అధికారులకు అడ్డాగా మారిపోయింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థానికంగా ఉన్నా, వారి పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు పేట్రేగి పోతున్నారు. కొందరు అధికారులు పైసా లేకపోతే పని జరగదనే స్థాయికి వెళ్లిపోయారు.
టౌన్‌ప్లానింగ్ అధికారులు భీమవరంలో బిల్డింగ్ నిర్మాణ అనుమతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నిర్మించిన భవనాలకు పన్ను వేయడానికి రెవెన్యూ అధికారులు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. సివిల్ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి 2 నుంచి 5 శాతం కమిషన్ ఇంజినీరింగ్ అధికారులు వసూలు చేస్తుండగా.. నెలనెల హోటల్స్, దుకాణాల నుంచి శానిటేషన్ అధికారులు వసూలు చేస్తున్నారు. కుళాయి కనెక్షన్లకు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు ఇవ్వాల్సిందే. బర్త్, డెత్ సర్టిఫికెట్లుకు వేలల్లో వసూలు చేస్తున్నారు. భీమవరం మున్సిపాలిటీలో ప్రతి దానిలో అవినీతి రాజ్యమేలుతుంది. ఇటీవల రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు టాన్‌ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఏసీబీకి పట్టిస్తానని చెప్పారు. మున్సిపాలిటిలో పనులుంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉన్నతాధికారికి పేమెంట్‌లు
మున్సిపాలిటీలోని ఉన్నత అధికారికి అన్ని విభాగాల నుంచి నెల నెల పేమెంట్లను ఆయా విభాగాల అధికారులు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సదరు ఉన్నత అధికారి ఇంటికి భీమవరం నుంచి కాంట్రాక్టర్లతో మెటీరియల్ సరఫరా చేయించుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. పేమెంట్లు అందించడం కోసం కొందరు అధికారులు రేటు పెట్టి వసూలు చేస్తున్నారని, అందులో కొంత అధికారికి, మరి కొంత వారికి అన్నట్లు వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు భీమవరం మున్సిపాలిటీపై దృష్టి సారించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి.
ప్రతి సెక్షన్‌లోనూ వసూళ్ల దందా
మున్సిపల్ ఉన్నతాధికారికి నెలనెలా పేమెంట్లు?