
కుంగిన వంతెన.. నిలిచిన రాకపోకలు
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని దొంగపిండిలో బందాల చేడు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెన ఆదివారం తెల్లవారుజామున కుంగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో సుమారు 6 వేల వరకు జనాభా ఉండగా.. గ్రామం చుట్టూ ఎటు చూసినా కాలువలు ఉన్నాయి. నిత్యం స్కూలు బస్సులు, కూలీలు, కార్మికుల వ్యాన్‌లు, ఆటోలపై పొరుగూరుకు వెళ్లి వస్తుంటారు. గ్రామంలో చేపలు, రొయ్యలు చెరువులు ఎక్కువగా ఉండటంతో తవుడు లోడులు, పట్టుబడులకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గ్రామం నుంచి పొరుగూళ్లు వెళ్లడానికి ఆర్ అండ్ బీ రోడ్డు ఒక్కటే కావడంతో ఆ మార్గంలో వంతెన కుంగిపోవడంతో ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.
3 దశాబ్దాల నాటి వంతెన
సుమారు 3 దశాబ్దాల క్రితం బందాల చేడు డ్రెయిన్‌పై వంతెన నిర్మించారు. కొంతకాలంగా ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుని అడుగుభాగం పెచ్చులూడిపోవడంతో కొంతమంది గ్రామస్తులు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతవరకూ ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు వంతెన కూలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంగిపోయిన వంతెన స్థానంలో ఎప్పుడు కొత్త వంతెన నిర్మిస్తారని, అప్పటి వరకు తమకు కష్టాలు తప్పవా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా వంతెన నిర్మించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.