ఒలుపులో వైరెటీలెన్నో ! | - | Sakshi
Sakshi News home page

ఒలుపులో వైరెటీలెన్నో !

Aug 3 2025 3:18 AM | Updated on Aug 3 2025 3:18 AM

ఒలుపు

ఒలుపులో వైరెటీలెన్నో !

సాక్షి, భీమవరం: కొబ్బరి కాయ ఒలవడం తేలికేనని తీసి పారేయకండి. దానికీ ఓ పద్ధతుంది. బొండాం, ముప్పేట, ముదర కాయ, కురిడీ అంటూ కాయల్లో రకాలున్నట్టే.. పిలక, బొంబాయి సీలు, కసింగలు, పోర్‌పట్టా, బోరాలు, మూడు నామాలు.. అంటూ ఒలుపుల్లోనూ పదికి పైనే వైరెటీలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒలుపులు మారుతుంటాయి. ప్రస్తుతం రికార్డు ధరతో జిల్లా నుంచి రోజుకు దాదాపు వంద లారీల కొబ్బరి కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడి ఒలుపు కార్మికులు వడివడిగా కాయలను వలుస్తున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురంలోని వశిష్ట గోదావరి, సముద్ర తీరం వెంబడి, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లోని ఆక్వా చెరువు గట్లు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో తోటలు సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి రాజస్తాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, పంజాబ్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి అవుతున్నాయి. తమిళనాడు, కేరళ తర్వాత మన కొబ్బరికి దేశ వ్యాప్తంగా గిరాకీ ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులో దిగుబడి తగ్గడంతో నెలన్నర రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్‌ ఏర్పడింది. మునుపెన్నడూ లేనివిధంగా రైతు ధర కాయకు రూ.18 నుంచి రూ.20 మధ్య నిలకడగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు వంద లారీల వరకు కాయలు ఎగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఒలుపులో రకాలెన్నో..

హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకు ఎంతో విశిష్టత ఉంది. పూజల్లో కొట్టడం నుంచి హోమాల్లో కాయ పళంగా వేయడం, దిష్టి, దిగదుడుపు తీయడం తదితర ప్రతి పనిలోనూ కొబ్బరికాయ ఉండాల్సిందే. మన ప్రాంతంలో ముచ్చిక, పిలకతో ఒలిచిన వాటిని వినియోగించినట్టే ఇతర ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఒలిచిన కాయలను వాడుతుంటారు. ఈ మేరకు జిల్లా నుంచి ఎగుమతులు జరిగే రాష్ట్రాల్లోని అవసరాలకు తగ్గట్టు కాయలను ఒలుస్తుంటారు. వీటిలో పిలక, బొంబాయి సీలు, రాయపూర్‌ సీలు, మూడు నామాలు, కసింగలు, బోరాలు, బెల్ట్‌ పోర్‌ పట్టా, బెల్ట్‌ లెస్‌ పోర్‌పట్టా, ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు తదితర పదికి పైనే ఒలుపుల్లో రకాలున్నాయి. ఎగుమతి అయ్యే ప్రాంతంలో ఆయా ఒలుపులకు ఏ పేర్లున్నా కానీ స్థానికంగా తాము ఈ విధంగా పిలుచుకుంటామని వ్యాపారులు, ఒలుపు కార్మికులు అంటున్నారు.

రాయపూర్‌ సీలును కాయ వెనుక నుంచి మూడు పేళ్లుగా ఒలిస్తే, కసింగలను ముందు నుంచి మూడు, వెనుక నుంచి మూడు పేడులుగా కాయపైన పీచు ఉంచి డొక్కను ఒలుస్తారు. బెల్టు పోర్‌పట్టా కోసం కాయకు నాలుగు వైపులా మధ్యలో అరంగుల డొక్క ఉంచి మిగిలిన దానిని తీసివేస్తారు. బెల్టు లెస్‌ కోసం నాలుగు వైపులా స్క్వేర్‌ ఆకారంలో పీచు ఉండేలా డొక్కను ఒలుస్తారు. అదేమాదిరి ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు సంఖ్యను బట్టి అన్ని పేళ్లుగా పైడొక్కను తొలగిస్తారు. మూడు నామాల కోసం కాయకు మూడు వైపులా అంగుళం వెడల్పున పీచు ఉంచి మిగిలిన డొక్కను పీచు సహా తీసేస్తారు. బొంబాయి సీలు కోసం కాయకు సగభాగం పూర్తిగా పీచును ఒలిచేసి మిగిలిన సగభాగం ఉంచేస్తారు. ఇలా వివిధ రకాలుగా కాయలను ఒలుస్తుంటారు.

కొబ్బరి ఒలుపులో పదికి పైగా రకాలు

పిలక, బొంబాయి సీలు, మూడు నామాలు, కసింగలు, పోర్‌పట్టా, బోరాలు

రాష్ట్రాన్ని బట్టి ఒలుపు మారుతుందంటున్న కార్మికులు

ఉమ్మడి పశ్చిమగోదావరిలో 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు

జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి

ఏ ఒలుపు ఎక్కడికి..

బెల్ట్‌లెస్‌ పోర్‌పట్టా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి జరిగితే బోరాలు యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు, ఆరు పేళ్లు యూపీ, కర్ణాటక, రాయపూర్‌ సీలు, ఐదు పేళ్లు మహారాష్ట్రకు, పిలకలు ముంబయి, బిహార్‌కు, మూడు నామాలు మహారాష్ట్రకు, కసింగలు అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో చాలా వరకు కొట్టకుండా వీటిని నేరుగా హోమాల్లో వేస్తారన్నారు. కాయపళంగా కన్నా ఒలిపించడం వల్ల బరువు తగ్గి ఎక్కువ కాయలు తీసుకువెళ్లే వీలుంటుందని అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడే ఒలిపించుకుని తీసుకువెళతారని అంటున్నారు. కావాల్సిన ఆకారంలో వేగంగా కాయలు ఒలవడం అనుభవంతో కూడిన పని. ఒక్కో కాయ ఒలుపునకు రూ.1.50 చొప్పున ఇస్తారు. రోజుకు ఒక్కో కార్మికుడు 800 నుంచి 1000 కాయలను ఒలుస్తుంటారు.

గండీర.. గటగట

ఉత్తరాది రాష్ట్రాల్లో కురిడీ కొబ్బరి ఆహారంలోనూ భాగంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌కు వెళుతుంటాయి. బాగా తయారైన కాయలను ఎంపిక చేసి ఎనిమిది పేళ్లుగా ఒలుస్తారు. గోదాముల్లో గాలి తగిలేలా అరలు కట్టి కాయలను నిల్వ చేస్తారు. ఆరు నెలలకు లోపలి నీరు పూర్తిగా ఇంకిపోయి గుడ్డు మాత్రమే ఉంటుంది. మొదట్లో 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఉన్న కాయ బరువు కురిడీ అయ్యేసరికి 80 గ్రా. నుంచి 100 గ్రా.కు తగ్గిపోతుంది. నాణ్యమైన గండీర, సెకండ్‌ క్వాలిటీని గటగటగా పిలుస్తుంటారు. గండీరకు రూ.30 ఉండగా గటగటకు రూ.28 ధర ఉన్నట్టు చెబుతున్నారు.

నాలుగు దశాబ్దాల అనుభవం

నలభై ఏళ్లుగా ఒలుపు పని చేస్తున్నాను. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వారు ఒక్కో విధంగా ఒలవమని చెబుతుంటారు. ఏ రకంగా ఒలవాలన్నా దాదాపు ఒకే సమయం పడుతుంటుంది. ప్రస్తుతం సీజన్‌ కావడం వల్ల పని ఎక్కువగా ఉంది.

– కొడవటి ఎర్రియ్య, ఒలుపు కార్మికుడు, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా

అవసరాన్ని బట్టి ఒలుపు

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఒలిచిన కాయలను వినియోగిస్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డరు మేరకు వారికి అవసరమైన రీతిలో ఒలిపించి ఎగుమతి చేస్తుంటాం. తమిళనాడులో దిగుబడులు తగ్గడంతో ప్రస్తుతం జిల్లా నుంచి ఎగుమతులు బాగున్నాయి. రైతులకు రికార్డు ధర వస్తోంది.

– కాసా సత్యనారాయణ, వ్యాపారి, యలమంచిలి, పశ్చిమగోదావరి జిల్లా

ఒలుపులో వైరెటీలెన్నో !1
1/8

ఒలుపులో వైరెటీలెన్నో !

ఒలుపులో వైరెటీలెన్నో !2
2/8

ఒలుపులో వైరెటీలెన్నో !

ఒలుపులో వైరెటీలెన్నో !3
3/8

ఒలుపులో వైరెటీలెన్నో !

ఒలుపులో వైరెటీలెన్నో !4
4/8

ఒలుపులో వైరెటీలెన్నో !

ఒలుపులో వైరెటీలెన్నో !5
5/8

ఒలుపులో వైరెటీలెన్నో !

ఒలుపులో వైరెటీలెన్నో !6
6/8

ఒలుపులో వైరెటీలెన్నో !

ఒలుపులో వైరెటీలెన్నో !7
7/8

ఒలుపులో వైరెటీలెన్నో !

ఒలుపులో వైరెటీలెన్నో !8
8/8

ఒలుపులో వైరెటీలెన్నో !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement