
నిమ్మల రెడ్‌బుక్ రాజ్యాంగం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన అత్యంత మంచి వ్యక్తి. బొకేలు, స్వీట్ బాక్సులు బదులు కూరగాయల కవర్లు మాత్రమే తీసుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పెట్లు వేయకుండా అత్యంత సాధారణంగా చేయాలని చెబుతుంటారు. రాష్ట్ర మంత్రయినా అత్యంత నిరాడంబర జీవితం. రోడ్లపైనే టిఫిను తినడం, పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేసే గొప్ప రాజకీయ నాయకుడు’
ఇదంతా సోషల్ మీడియాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురించి ఆయన సొంత టీం ఊదరగొట్టే వ్యవహారం. పాలకొల్లులో మాత్రం ఆయన పొలిటికల్ రెడ్‌బుక్ పేరుతో వైఎస్సార్‌సీపీ లీడర్లను, కేడర్లను వేధింపులకు గురి చేస్తూ వరుస కేసులతో హడావుడి చేస్తున్నారు. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే దళిత హక్కులను పరిరక్షించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగించడం.
పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు రెడ్‌బుక్ హడావుడి చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. సమయం, సందర్భం చూసుకుని మరీ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని ముప్పుతిప్పలు పెట్టేలా వేధింపుల కేసులకు తెర తీశారు. పాలకొల్లు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని కొత్త సంస్కృతికి నిమ్మల బీజం వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2022లో టిడ్కో ఇళ్ళ గృహ ప్రవేశాల సందర్భంగా జరిగిన చిన్నపాటి వాదనపై తాజాగా సీబీసీఐడీ ఎంకై ్వరీ వేయించడం, కొద్ది నెలల క్రితం జరిగిన యలమంచిలి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ముగ్గురు వ్యక్తుల ఫిర్యాదుతో 42 మందిపై ఒకేరోజు కేసు నమోదు చేయడం ఇంకొక సంచలనం. అధికారంలో ఉంటే ఒకలాగా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించే నిమ్మల మంత్రి కావడంతో రెడ్‌బుక్ పేరుతో వేధింపులను తీవ్రతరం చేస్తున్నారు.
ఎంపీపీ ఎన్నికల స్పెషల్ కేసు
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి ఎంపీపీ ఎన్నిక మార్చి 26, 27 తేదీల్లో నిర్వహించారు. టీడీపీకి నామమాత్రపు బలం కూడా లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులను టీడీపీలోకి తీసుకోవడానికి మంత్రి నిమ్మల రకరకాాల ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. ఈ క్రమంలో ఎన్నిక వాయిదాకు సరికొత్త ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా మార్చి 27న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కానిస్టేబుల్ ఫిర్యాదుతో 17 మందిపైన, అదేరోజు వీఆర్‌ఓ విధులకు ఆటంకం కలిగించారని 9 మంది పైన కేసులు నమోదు చేశారు. అదేరోజు టీడీపీ నాయకుడి ఫిర్యాదుతో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడాల గోపి, కీలక నేతలు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ సహా 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే ముగ్గురు ఎస్సీల పైన, ఒక ఎస్టీ పైన అట్రాసిటీ కేసు నమోదు చేయడం.
వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపుల పర్వం
ఎంపీపీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 42 మందిపై మూడు కేసులు
ఎస్సీ, ఎస్టీలపై పాలకొల్లులో అట్రాసిటీ కేసు
2022 ఘటనపై సీబీసీఐడీ ఎంకై ్వరీ
ఆదర్శ ఎమ్మెల్యే, మంత్రి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
బయటికి మాత్రం రాజకీయ వేధింపుల వ్యవహారం
వాదులాట ఘటనకు సీబీసీఐడీ కేసా?
2022 ఆగస్టు 5న పాలకొల్లులో టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు గృహాల పంపిణీ జరిగింది. నిమ్మల రామానాయుడును స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి ఆహ్వానించారు. శిలాఫలకంలో నిమ్మల పేరు పెద్దగా లేదనే కారణంతో 50 మంది కార్యకర్తలతో ప్లకార్డులతో సభలోకి వచ్చి హడావుడి చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలకు, నిమ్మలకు మధ్య వాగ్వాదం జరిగింది. కట్ చేస్తే... 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 13న తాడి శశిధర్ అనే వ్యక్తితో మంత్రి ఫిర్యాదు చేయించారు. కేసులో 24 మందిపై ఫిర్యాదు అందడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కొందరు బెయిల్ తీసుకోగా, మరికొందరు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ కేసులో పోలీసులు మే నెలలో చార్జిషీట్ దాఖలు చేయడంతో ఏలూరు జిల్లా కోర్టులో 861/2025 నెంబరుతో కేసు నడుస్తోంది. గురువారం వాయిదా జరిగింది. ఇదే కేసును మంత్రి ఆదేశాలతో గత వారం సీబీసీఐడీకి అప్పగించారు. ఇలా చిన్న ఘటనలకు కూడా భూతద్దంలో చూపి వేధింపులకు తెరతీయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.