
గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో శనివారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మద్ధతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నేడు పిల్లలు బడికి వచ్చేది.. మధ్యాహ్న భోజనం, దుస్తులు, కోడిగుడ్డు, చిక్కీ, రాగి జావ కోసం అన్నట్లు, టీచర్లు ఇవి పిల్లలకు అందించి ప్రభుత్వానికి లెక్క చెప్పేవారు అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీలు జరిగి 40 రోజులు దాటినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు చెప్పినా.. పరిష్కారం దిశగా అధికారులు ఆలోచించడం. లేదన్నారు. 11వ పీఆర్‌సీ గడువు ముగిసి 2 సంవత్సరాలు పూర్తి అయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటై 12 నెలలు గడచినా ఆ ఊసే లేదన్నారు. 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు, పోలీసులు ఇతర ఉద్యోగులు సుమారు 11 వేల మందికి పాతపెన్షన్ విధానం అమలు చేయాల్సి ఉందన్నారు. డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. ధర్నా అనంతరం వినతి పత్రాన్ని కలెక్టరేట్‌లో అందజేశారు.