
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): పోలవరం కాంటూరు లెక్కలన్నీ కాకి లెక్కలేనని, తక్షణం వాటిని రద్దు చేసి నిర్వాసితులందరికీ ఒకే విధమైన పరిహారం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భూమి అధికార్ ఆందోళన జాతీయ సమావేశంలో ఏలూరు జిల్లా నుంచి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు, పేదల సమస్యలపై మాట్టాడినట్లు చెప్పారు. పోలవరం నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇళ్లు ఖాళీ చేయించే నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ యూనిట్‌గా గుర్తించి రూ.10 లక్షలు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. మార్కెట్ రేటుకు 4 రెట్లు అదనంగా పరిహారం ఇవ్వాలని, ఇళ్లు, పశువులు, చెట్లకు సంబంధించి పరిహారం ఇవ్వాలని, రవాణాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పునరావాస కాలనీల్లో ఇళ్లను నాణ్యంగా నిర్మించాలని, రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, విద్యుత్తు సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు.