
సంపద లేని కేంద్రాలు
బుట్టాయగూడెం: గ్రామాల్లో చెత్తాచెదారాన్ని సేకరించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చెత్త నుంచి సంపద వచ్చేలా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరుగా సాలిడ్ వేస్టు మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉపయోగపడుతుందన్న లక్ష్యంతో ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రంలో ఈ షెడ్లను నిర్మించారు. గత ప్రభుత్వ పాలన సమయంలో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు నేడు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.
చాలాచోట్ల నిరుపయోగంగా..
జిల్లావ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్వహణా లోపం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. తడి, పొడి చెత్త సేకరణకు సరైన సిబ్బందిని కూడా కేటాయించకపోవడంతో సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఉదాహరణకు.. బుట్టాయగూడెం మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిని 18 గ్రామ సచివాలయాలుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త నుంచి సంపద తయారు చేయడానికి షెడ్లను నిర్మించారు. అయితే వీటిలో కేవలం మూడు మినహా మిగిలిన కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణలో సిబ్బంది కొరత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఆయా పంచాయతీల పరిధిలో అవసరమైన మేరకు గ్రీన్ అంబాసిడర్‌లను ఏర్పాటు చేసి సంపద కేంద్రాల నిర్వహణకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
చెత్త రాదు.. ఎరువు తయారు కాదు
నిరుపయోగంగా చెత్త నుంచి సంపద కేంద్రాలు
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
రెడ్డిగణపవరంలో నిరుపయోగంగా..
బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా ఉంది. తోపుడు రిక్షాలు కూడా మూలన పడ్డాయి. కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా తడి, పొడి, చెత్త సేకరణ చేసి సంపద కేంద్రాలను ఉపయోగంలోకి వచ్చే విఽ దంగా చర్యలు తీసుకోవాలి.–అందుగుల ఫ్రాన్సిస్,
కేవీపీఎస్ నాయకులు, రెడ్డిగణపవరం
పంచాయతీలో ఆదాయం లేదు
గత ఆరు నెలలుగా పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రావడంలేదు. దీనితో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అనేక అవస్థలు పడుతున్నాం. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితిలో ఉన్నాం. గ్రీన్ అంబాసిడర్‌లు నెలకు రూ.15 వేలు అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సిబ్బంది కొరతతో అనేక అవస్థలు పడుతున్నాం. –ఉయికే బొజ్జి, సర్పంచ్, కేఆర్‌పురం

సంపద లేని కేంద్రాలు

సంపద లేని కేంద్రాలు