
రెండు దశాబ్దాలుగా ట్రయల్ రన్‌కే పరిమితం
కామవరపుకోట: ఆంధ్రప్రదేశ్ ఎర్రకాలువ ఎత్తిపోతల పథకం రెండు దశాబ్ధాలుగా ట్రయల్ రన్‌కే పరిమితమైంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 9 కోట్లు కేటాయించినా పనులు సక్రమంగా పూర్తిచేయకపోవడంతో ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. మెట్ట ప్రాంతంలోని కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లోని కొన్ని గ్రామాల రైతులకు నీటి వసతి కల్పించేందుకు 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎర్ర కాలువ ఎత్తిపోతల పథకం చేపట్టింది.
రూ.9 కోట్లతో నిర్మాణ పనులు
రూ.9 కోట్లు నిధులు కేటాయించి కామవరపుకోట మండలంలోని ఈస్ట్ యడవల్లి సమీపంలో సుమారు 103 ఎకరాల విస్తీర్ణం గల గిరమ్మ చెరువు వద్ద నిర్మాణ పనులు చేపట్టారు. మూడు కిలోమీటర్ల వరకు పైపులైను వేసి అక్కడ నుంచి కాలువను తవ్వారు. ఈ కాలువను తవ్వుతుండగా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పొలాల మీదుగా కాలువ తవ్వవద్దంటూ అడ్డుకుని హైకోర్టును ఆశ్రయించారు. దీనితో కొంతకాలం పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత ఆనాటి జిల్లా కలెక్టర్ నష్టపరిహారం ఇస్తామని రైతులకు నచ్చజెప్పి మరలా పనులు ప్రారంభించారు. ఆ కాలువను ద్వారకాతిరుమల మండలం దోరసానిపాడు వద్ద రెండు పాయలుగా విభజించి ఎడమ కాలువ ద్వారా ద్వారకాతిరుమల మండలంలోని చెలికానివారిపోతేపల్లి, దొరసానిపాడు, కుడి కాలువ ద్వారా కామవరపుకోట మండలంలోని ఈస్ట్‌యడవల్లి, వెంకటాపురం, రావికంపాడు గ్రామాల్లోని చెరువులను నింపి రైతులకు నీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు.
7 వేల ఎకరాల సాగు లక్ష్యం
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మండలాల్లోని సుమారు 6 గ్రామాల చిన్న సన్నకారు రైతులకు సాగునీరు అందించి 7 వేల ఎకరాలు సాగులోకి తీసుకురావాలనేది లక్ష్యం. దీనిద్వారా ఆయకట్టు కింద పామాయిల్, కోకో, కొబ్బరి అరటి వంటి పంటల ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అయితే ఈ ఎత్తిపోతల పథకం పనులను అప్పటి టీడీపీ ప్రభుత్వం సక్రమంగా చేపట్టకపోపవడంతో రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు నిరుపయోగంగానే మారింది. పైప్‌లైన్ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఎత్తిపోతల పథకం ద్వారా కాలువలకు సక్రమంగా నీరు చేరడం లేదు. దీంతో అప్పుడప్పుడు అధికారులు రావడం.. ట్రయల్ రన్ వేయడం తప్ప ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆ ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
నిరుపయోగంగా
ఎర్రకాలువ ఎత్తిపోతల పథకం

రెండు దశాబ్దాలుగా ట్రయల్ రన్‌కే పరిమితం