
పాము కాటుతో రైతు మృతి
ముసునూరు: పాము కాటుకు ఓ రైతు బలయ్యాడు. వివరాల ప్రకారం అక్కిరెడ్డిగూడెంకు చెందిన రైతు ముత్తంశెట్టి భాస్కరరావు(65) బుధవారం తన పొలంలో పని చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు అతడ్ని హుటాహుటీన నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా, మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మండవల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన మత్తె మణికంఠ(21) తన తాతయ్యకు అనారోగ్యంగా ఉండటంతో మోటారుసైకిల్‌పై ఉయ్యూరు వెళుతున్నాడు. బుధవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో లింగాల డ్రాప్ వద్ద ప్రమాదవశాత్తు బైక్ నుంచి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి కుమారి ఫిర్యాదుపై ఏఎస్సై శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జ్యూయలరీ వర్క్ షాప్‌లో చోరీ
ద్వారకాతిరుమల: స్థానిక పసరుకోనేరు వద్ద ఉన్న జ్యూయలరీ వర్క్ షాపులో చోరీ జరిగింది. బాధితుడి కథనం ప్రకారం. తిమ్మాపురం గ్రామానికి చెందిన వి.హనుమంతరావు ద్వారకాతిరుమలలోని పసరుకోనేరు వద్ద జ్యూయలరీ వర్క్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూలానే మంగళవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి బుధవారం ఉదయం షాపునకు వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించాడు. తలుపులు తెరచి చూడగా షాపులోని 4 గ్రాముల బంగారం, పావుకేజీ వెండి, అలాగే రూ.2 వేలు నగదు పోయినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.
చర్చి కానుకల హుండీ చోరీ
చాట్రాయి: మంకొల్లు గ్రామంలో ఆర్‌సీఎం చర్చి హుండీని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. సమీపంలో ఉన్న తమ్మిలేరు ప్రాజెక్టు కాలువ వద్ద హుండీ పగల కొట్టి అందులో ఉన్న నగదును కాజేశారు.
ఎకై ్సజ్ పోలీసులమంటూ బురిడీ
అత్తిలి: ఎకై ్సజ్ పోలీసులమంటూ బురిడీ కొట్టించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తిలి ఎస్సై పి.ప్రేమరాజు తెలిపిన వివరాల ప్రకారం కంచుమర్రు గ్రామంలో కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్న డి.నాగ వెంకట అశోక్ వద్దకు బుధవారం నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఎకై ్సజ్ పోలీసులమని నమ్మబలికి రూ.2 వేలు బలవంతంగా వసూలు చేసి వెళ్లిపోయారు. బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంచిలి రోడ్డులో కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేటకు చెందిన వారు కాగా, ఒకరిది కృష్ణాజిల్లా కృత్తివెన్ను గ్రామం అని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.

పాము కాటుతో రైతు మృతి