
కొండ దిగి వస్తే సౌకర్యాలు కల్పిస్తాం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని బాహ్య ప్రపంచానికి దూరంగా మారుమూల అటవీప్రాంతంలో ఉన్న మోదేలు గ్రామాన్ని ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్, వివిధ శాఖలకు చెందిన అధికారులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మోదేలు గిరిజనులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మోదేలు గ్రామం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా రోడ్డు, విద్యుత్ సౌకర్యం లేక అనే అవస్థలు పడుతున్నామని గిరిజనులు ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. గత ప్రభుత్వంలో మోదేలు గ్రామానికి రోడ్డుతోపాటు విద్యుత్ సౌకర్యం కూడా మంజూరైందని, అయితే పనులు చేపట్టేందుకు ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారని లేఖలో తెలిపారు. ఈ లేఖకు సంబంధించి తాను కూడా ఢిల్లీ వెళ్లానని, కలెక్టర్ ఆదేశాల మేరకు మోదేలు గిరిజనులతో మాట్లాడేందుకు వచ్చినట్లు పీవో తెలిపారు. మోదేలు గ్రామం వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలో ఉందని ఇక్కడ రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశాలు లేవని ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారని పీఓ చెప్పారు. ఈ నేపథ్యంలో మోదేలు గిరిజనులు కొండదిగి వస్తే బుట్టాయగూడెం మండలం డోలుగండి పరిసర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మాణంతోపాటు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. దీనిపై గ్రామస్తులంతా ఆలోచన చేసి ఒక అంగీకారానికి వస్తే సౌకర్యాల ఏర్పాటుకు ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, ఎంపీటీసీ కొవ్వాసి గోవిందరావు, గిరిజన సంక్షేమ శాఖ డీఈ ఎం. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పట్ల చిన్నయ్య, ఏఎంఓ శిరమయ్య, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం రేంజ్‌లకు చెందిన ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాములు నాయక్