
ట్రిపుల్ ఐటీలో ముగిసిన ప్లేస్‌మెంట్ స్కిల్స్ శిక్షణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఈ4 విద్యార్థులకు ప్లేస్‌మెంట్ స్కిల్స్ పెంపొందించేందుకు గాను విద్యార్థులకు గత పదిరోజులుగా నిర్వహిస్తున్న నైపుణ్యాల పెంపుదల శిక్షణ బుధవారంతో ముగిసింది. యునైటెడ్ వే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కెరీర్ డెవలప్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ (సీడీపీసీ) ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా దీనిలో మొత్తం 300మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు అప్టిట్యూడ్, రీజనింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ఫ్యాకల్టీలకు మొమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఏఓ లక్ష్మణరావు, ప్లేస్‌మెంట్ సెల్ ఇన్‌చార్జి రుద్రం చింతయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ చెక్ పవర్ రద్దు
ముదినేపల్లి రూరల్: పెయ్యేరు పంచాయతీ సర్పంచ్ చెక్‌పవర్ రద్దు చేస్తూ డీపీవో కె అనురాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకలు జరగడంతో పాటు పాలనా పరమైన అంశాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గ్రామానికి చెందిన కొందరు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం నివేదిక ఆధారంగా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేసినట్లు సమాచారం. చెక్‌పవర్ రద్దుపై వారం రోజుల లోపు సర్పంచ్ కలెక్టర్‌కు అప్పిల్ చేసుకోవచ్చని డీపీవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జాతీయస్థాయి క్రీడల్లో
సత్తా చాటిన తన్మయ
పెంటపాడు: జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ హైస్కూల్ ప్లస్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సత్తి తన్మయ శ్రీదేవి సత్తా చాటింది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఒలింపిక్స్ భారత్ నిర్వహించిన బేస్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకోవడంతోపాటు పార్ట్‌నర్ విభాగంలో సాధారణ బాలికతో కలిసి కాంస్య పథకాన్ని కూడా అందుకుంది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో బిలాస్పూర్ అటల్ బిహారీ వాజ్‌పేయి విశ్వవిద్యాలయంలో ఈనెల 24 నుంచి 28 వరకు జరిగిన జాతీయ స్థాయి బేస్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పోటీల్లో తన్మయ శ్రీదేవి ప్రతిభ కనబరిచింది.

ట్రిపుల్ ఐటీలో ముగిసిన ప్లేస్‌మెంట్ స్కిల్స్ శిక్షణ