టీచర్లపై పీ4 ప్రయోగం | - | Sakshi
Sakshi News home page

టీచర్లపై పీ4 ప్రయోగం

Jul 30 2025 8:43 AM | Updated on Jul 30 2025 8:43 AM

టీచర్లపై పీ4 ప్రయోగం

టీచర్లపై పీ4 ప్రయోగం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీచర్లు పీ4 దాతలుగా మారాలి.. ప్రతి మండలంలో 190 మంది ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నమోదై ఒక్కొక్కరూ ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి. ఇవి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో డీఈఓ జారీ చేసిన ఉత్తర్వులు. ఉపాధ్యాయ సంఘాల తిరుగుబాటుతో ఆ ఉత్తర్వులను నిలిపివేశారు. పీ4 పథకాన్ని బలవంతంగా జనాలపై రుద్దే ప్రక్రియలో భాగంగా దాతల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. జిల్లాలో 99,905 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించిన ప్రభుత్వం దాతల సాయం కోసం ఎదురుచూస్తుండగా ఇంతవరకు 4,908 మంది దాతలు రిజిస్టరయ్యారు. దాతలుగా ఆశించిన స్థాయిలో ఎవరూ ముందుకు రాకపోవడంతో దాతల అన్వేషణ కొనసాగుతూనే ఉంది.

వివాదాస్పదంగా విద్యా శాఖ ఉత్తర్వులు

డబ్బున్న వ్యక్తులు పేదల కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్ధిక సహకారం, విద్య ద్వారా పైకి తీసుకువచ్చేలా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం పీ4 పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకాన్ని ప్రారంభించి ఎంపిక చేసిన దాతలను కొనియాడి సన్మానం చేశారు. సభ జరిగిన రోజు మండలంలో 206 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. మంత్రి కొలుసు పార్ధసారధి కుమారుడు నితిన్‌ సాయికృష్ణ 22 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి జిల్లా స్థాయిలో ప్రతి వారం పీ4పై సమీక్ష, డోనర్ల జాబితా పేరిట అంకెలతో కూడిన నివేదికపై సమీక్షలు కొనసాగుతున్నాయి. పైకి తీసుకురావాల్సిన కుటుంబాలు ఎక్కువగా ఉండటం, దాతలు తక్కువగా ఉండటం, డబ్బున్న దాతల నుంచి స్పందన లేకపోవడంతో నిరంతర సమీక్షలు, రకరకాల ఉత్తర్వులతో అధికార యంత్రాంగం జిల్లాలో పీ4 జపం చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో కలెక్టర్‌ ఆదేశాలతో విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ప్రతి మండలంలో హెచ్‌ఎంలు, టీచర్లు సగటున 190 మంది ఉంటారని, ఒక్కొక్కరు 2 నుంచి 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలని, 24 గంటల వ్యవధిలో అందరూ పీ4 పథకంలో మార్గదర్శకులుగా నమోదు కావాలని సర్క్యులర్‌ జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు మొదలుకొని టీచర్ల వరకు నిరసన గళం విప్పడంతో ఉత్తర్వులు నిలిపివేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, వివిధ కేడర్లలోని ఉద్యోగులు జీతభత్యాలు సక్రమంగా అందక, ప్రభుత్వ హామీలు అమలుకాక సతమతమవుతుండగా, వారిపై పీ4 ఒత్తిడి తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఒక్కో టీచర్‌ 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలి

ఉపాధ్యాయుల తిరుగుబాటుతో నిలిచిన వ్యవహారం

దాతలు దొరక్క అధికారుల తంటాలు

ప్రారంభానికి ముందే పీ4 విఫలం

టార్గెట్ల పేరుతో వేధింపులు

పీ4 అమలుకు సంబంధించి ప్రభుత్వం జిల్లాలకు టార్గెట్లు కేటాయించింది. ఇంట్లో వినియోగించే వస్తువులు, కరెంటు, ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకుని రెండు నెలల క్రితం పీ4 సర్వేను జిల్లా వ్యాప్తంగా నిర్వహించి జిల్లాలో తక్షణమే పైకి తీసుకురావాల్సిన 99,905 బంగారు కుటుంబాలను గుర్తించారు. ఆ కుటుంబాల్లో 2,70,860 మంది ఉన్నారు. ఇంత వరకు జిల్లాలో 4,908 మంది మార్గదర్శకులుగా నమోదై 38,504 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. మిగిలిన 61,400 కుటుంబాలకు దాతల అవసరం ఉంది. ఈ క్రమంలో దాతల అన్వేషణలో భాగంగా స్థానిక వ్యాపారులు మొదలుకొని ఎన్‌ఆర్‌ఐల వరకు సాయం చేయమని కోరుతున్నా పూర్తి స్ధాయిలో దాతలు ముందుకు రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement