
భవన నిర్మాణ కార్మికుల పోరుబాట
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును తక్షణం పునరుద్ధరించాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారం చేపడితే సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, సంక్షేమ బోర్డుకు రూ.కోటి జమ చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు హామీ ఇచ్చి తుంగలోకి తొక్కారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 28న ఆయా తహసీల్దార్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. కార్మిక శాఖ కార్యాలయం ఎదుట, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళ చేపట్టేందుకు సిద్దమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది కార్మికులు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల భవన నిర్మాణ రంగ కార్మికులు సుమారు 2 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో తాపీ పని నుంచి సెంట్రింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, పెయింటర్స్, టైల్స్ వేసేవారు, వీరికి సహాయకులు ఇలా 18 రకాల పనివారు ఈ జాబితాలోకి వస్తారు.
కార్మికుల డిమాండ్లివే
● కార్మికుల సంక్షేమానికి బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును పునరుద్దరించాలి.
● పెండింగ్ క్‌లైయిమ్‌లు పరిష్కరించాలి.
● వయస్సు రీత్యా పనిచేయలేని వారికి, పనిచేస్తూ ప్రమాదాలకు గురై అంగవైకల్యం పొందిన వారికి సంక్షేమ బోర్డు నుంచి పింఛన్ సౌకర్యం కల్పించాలి.
● సిమెంట్, ఇటుక, ఐరన్, చిప్స్ తదితర మెటీరియల్ ధరలు అదుపు చేయాలి
● కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండి కై ్లములు చెల్లించకపోవడం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలకొద్దీ పెండింగ్‌లో ఉన్నాయి. సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల 18 రకాల భవన నిర్మాణ రంగ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటున్నారు.
వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని ఆందోళనలు
ప్రభుత్వం స్పందించకుంటే ఉధృతం చేసే యోచన