
భూ సేకరణ పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పనులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టరు కె.వెట్రిసెల్వి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూములు అందించిన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణం, తదితర పనులకు ఏలూరు జిల్లాలో ఇంకా 5 వేల ఎకరాల భూమి అవసరమని, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 800 ఎకరాలను గుర్తించామన్నారు. మిగతా 4,200 ఎకరాలు వారానికి 500 ఎకరాలు చొప్పున ఆగస్టు15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తిగా గిరిజనేతర భూములు మాత్రమే గుర్తించాలని స్పష్టం చేశారు. భూమిని గుర్తించిన తర్వాత ఆయా గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు. ఆయా రైతులతో ఆర్డీవో, డీఎస్పీ అధికారులు చర్చించి వారి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. భూములకు పరిహారాన్ని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు చెల్లించటానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అధికార యంత్రాంగం వ్యవహరించాలని కలెక్టరు సూచించారు.
పోలవరం నుంచి భారీగా నీటి విడుదల
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పోలవవరానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 5 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నీటిమట్టం 31.050 మీటర్లుండగా దిగువకు 6,70,335 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
భూ కేటాయింపులు రద్దు చేయాలి
నూజివీడు: మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులకు చెందిన నితిన్ కృష్ణ కనస్ట్రక్షన్ కంపెనీకి ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 45.60 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎకరం కేవలం రూ.ఐదు లక్షలకే విక్రయించటం దుర్మార్గమన్నారు. వాస్తవానికి ఆగిరిపల్లి ప్రాంతంలో ఎకరం భూమి రూ.50 లక్షలపైగా ఉందని, భూపందేరం వెనుక ఏదో మతలబు ఉన్నట్టు అనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని, హామీల అమలును విస్మరించి ప్రభుత్వ భూములు, ప్రకృతి సంపదలను కార్పొరేట్ కంపెనీలకు, కేబినేట్ పెద్దలకు అప్పగిస్తూ పాలన చేయటం సబబుకాదన్నారు.
అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి
భీమవరం అర్భన్: సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘అక్షర ఆంధ్ర’ అక్షరాస్యత 2025–26పై శిక్షణా తరగతుల ప్రారంభ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 2029 నాటికి నిరక్షరాస్యులు లేని జిల్లాగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు నిరంతరాయంగా కృషి చేయాలన్నారు.
స్వర్ణకార సంఘ కార్యవర్గం ఎన్నిక
ఆకివీడు: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా స్వర్ణకార సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ పట్నాల శేషగిరిరావు చెప్పారు. ఆరోసారి తమను ఎన్నుకోవడంతో డబుల్ హ్యాట్రిక్ సాధించామన్నారు. 25 ఏళ్లపాటు ఒక సంఘం ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే ప్రథమమన్నారు. స్వర్ణకారులకు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు సంఘం తరుఫున చేసిన సేవల్ని గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. అధ్యక్షుడిగా తనతో పాటు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ వెంకట రామకృష్ణ, కోశాధికారిగా కొమ్మోజు రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు కొనసాగుతారని చెప్పారు.

భూ సేకరణ పూర్తి చేయాలి