
ఐకమత్యంతో సాగాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని తద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. మంగళవారం స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ప్రారంభోత్సవ సమావేశం జాతీయ అధ్యక్షుడు రెబ్బ ఇమ్మానుయేల్, జాతీయ కార్యదర్శి జీవన్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తానేటి వనిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేవుడి మనస్తత్వాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రేమ, క్షమించడం, ఆదరణ లక్ష్యాలుగా జీవిస్తేనే మోక్షమార్గం లభిస్తుందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ఐకమత్యంతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలకు అందేలా స్వచ్ఛంద సంస్థల నాయకులు కృషి చేయాలన్నారు. ఆర్‌సీఎం ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక అభివృద్ధి ఐక్యత, సేవ, ప్రేమ గుణాలతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. ఆలిండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి పాస్టర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రాల పరిధిలో పాస్టర్లు అంతా కలిసి ఆలిండియా పాస్టర్స్ ఫెడరేషన్‌గా ఏర్పడినట్లు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు బిషప్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడుల నివారణ, పేదలకు సేవ లక్ష్యంగా ఫెడరేషన్ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా పాస్టర్‌లు జాతీయ జెండాలు ప్రదర్శించారు. అనంతరం ఫెడరేషన్ లోగోను, జీవన్ కుమార్ రాసిన ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో వైఎస్ థామస్ రెడ్డి, రెక్టార్ జనరల్ పీ బాల, రెక్టార్ ఫాదర్ ఐ.మైఖేల్, సుప్రీంకోర్టు న్యాయవాది, ఏపీ లాయర్స్ ఫోరం చైర్మన్ జీ రోనాల్డ్ రాజు, బిషప్ కారుపాటి శాంతి సాగర్, ఏలూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ ఎన్.సుధీర్ బాబు పాల్గొన్నారు.