
దళిత వితంతువుపై టీడీపీ నేతల వేధింపులు
యలమంచిలి: తమ ఇళ్లకు దారి ఇవ్వడం లేదనే అక్కసుతో కనకాయలంక గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఓ దళిత వితంతువుపై కక్ష సాధింపులకు పూనుకున్నారు. దీనిని నిరసిస్తూ ఆదివారం మిగిలిన పార్టీల నాయకులు నిరసన తెలిపి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. కనకాయలంకకి చెందిన దళిత వితంతువు డొల్లా విజయలక్ష్మి గ్రామంలో రేకుల షెడ్డు వేసుకుని జీవిస్తోంది. ఆమెకున్న స్థలంలో నుంచి దారి కావాలని చాలాకాలంగా స్థానిక తెలుగుదేశం నాయకులు పట్టుబడుతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా స్థలాన్ని పరిశీలించి ఆమె అంగీకరిస్తే రోడ్డు వేసుకోమని చెప్పారు. అయితే ఆ స్థలంలో తాను ఇల్లు కట్టుకుంటానని, అంతవరకూ తిరగడానికి అభ్యంతరం లేదని, కానీ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వనని విజయలక్ష్మి చెప్పింది. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం ఆమె తను రేకుల షెడ్డుకు విద్యుత్ సర్వీసును ఏర్పాటు చేసుకుంది. అయితే తెలుగుదేశం నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఆమె ఇంటి విద్యుత్ మీటర్‌ను తొలగింపజేశారు. దీనిపై గ్రామంలోని మిగిలిన పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న తెలుగుదేశం నాయకుల తీరును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ, జనసేన నాయకులు పులి వెంకట సుబ్రహ్మణ్యం, వలవల ప్రసాద్, లంక కిషోర్, వలవల శ్రీనివాస్, చింద్రపు గణపతి, నెల్లి ఆనందరావు, యన్నాబత్తుల సుధీర్, వలవల నరసింహమూర్తి, కారుపల్లి శ్రీను, చిల్లే రవి, చిల్లే నాని, యాతం నాగపండు, యాతం సీతారాముడు, యాతం రెడ్డినాయుడు, యా తం వెంకటేశ్వరరావు (చిన్నబ్బు) పాల్గొన్నారు.