
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దారుణం
కొయ్యలగూడెం: ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుపై మండలంలోని గవరవరంలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను పెడదోవ పట్టిస్తున్నారని, దీనికి ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు బాకా ఊదుతున్నారని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న దాడులకు కూటమి ప్రభుత్వం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉందని, హోం మంత్రిగా మహిళ ఉండటం రాష్ట్రంలోని మహిళలకు సిగ్గుచేటుగా మిగిలిందన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు శీమకుర్తి సత్యనారాయణ, బిరుదుగడ్ల ప్రేమ్ కుమార్, కసుకుర్తి వేణు, పలివెల దుర్గారావు, ఎంటపల్లి రవిబాబు, ప్రగడ శివాజీ, వేముల సత్తిబాబు. నీలం అబ్బులు, బొమ్మ శ్రీను, మరపట్ల వెంకటేశ్వర్లు, కోనాల దివాకర్, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.