
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
జంగారెడ్డిగూడెం: గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 29న 394.795 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, ఇద్దరు తప్పించుకున్నారు. వారిలో కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన పిడుగు శ్రీనివాసరావు అలియాస్ బాబిని స్థానిక జాతీయ ప్రధాన రహదారిపై ఫైర్ స్టేషన్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్, సెల్‌ఫోన్ సీజ్ చేశామన్నారు. కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. అతనిపై మండపేట రూరల్, తిమ్మాపురం, జగ్గంపేట, రాజమండ్రి ప్రకాష్ నగర్‌లో 36 దొంగతనం కేసులు, దేవరపల్లి, పెనుమంట్ర, రాజమండ్రి, నెల్లూరు జిల్లా వి.సత్రం పోలీస్‌స్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణా కేసులు ఉన్నాయని తెలిపారు.