
రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు చెలరేగిపోతున్నాయని సీపీఐ జాతీ య కార్యవర్గ సభ్యురాలు, పార్టీ ఏలూరు జిల్లా ఇన్‌చార్జ్ అక్కినేని వనజ విమర్శించారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక అని చెప్పి ఇసుకను మాఫియాకు అప్పజెప్పి వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్ అదనపు చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేశారని, లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని పిలుపునిచ్చారని, నేడు అదే లోకేష్, చంద్రబాబు స్మార్ట్ మీటర్లు బిగించేలా ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వచ్చేనెల విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. ఆగస్టు 23,24,25 తేదీల్లో ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిందేమీ లేదని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.