
యువకుడి ఆత్మహత్య
దెందులూరు: సోమవరప్పాడులో లారీలు నిలుపు ప్రదేశంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన గొన్నాబత్తుల గణేష్ (38)కు పదేళ్ల కిత్రం వివాహం కాగా నాలుగేళ్ల కిత్రం మనస్పర్థల కారణంగా భార్య,భర్తలు విడాకులు తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా వేరే మహిళతో సహజీవనం చేస్తుండగా తరచూ ఆమెతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె దగ్గరికి వెళ్లి గొడవ పడుతుండగా కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై గణేష్ లారీ పై తాడుతో గురువారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
మద్యానికి బానిసై..
పెంటపాడు: మద్యానికి బానిసై మతి స్థితిమతం లేని పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెంటపాడు ఏఎస్సై రాజేంద్ర, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామానికి చెందిన జోగి వెంకట సత్యనారాయణ(45) గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మతి స్థిమితం కూడా తగ్గిపోయింది. గురువారం ఉదయం నిద్రనుండి లేచి బయటకు వచ్చి మరలా వెంటనే లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టుకొని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుం సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై స్వామి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
మానవ అక్రమ రవాణాను నిరోధించాలి
పాలకొల్లు సెంట్రల్: మనుషుల అక్రమ రవాణాను నిరోధించాలని సీడీపీవో సీహెచ్ ఇందిర అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారిచే మనుషుల అక్రమ రవాణాపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ప్రజ్వల కో–ఆర్డినేటర్ శ్రావ్య శృతి మాట్లాడుతూ అక్రమ రావాణాకు, లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా గత 28 ఏళ్లుగా పద్మశ్రీ డా.సునీతకృష్ణన్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల సమన్వయంతో 29,200 మంది అమ్మాయిలను, మహిళలను కాపాడి వారికి పునరావాసం కల్పించారన్నారు. సమస్య ఎదురైనపుడు 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.