
వెలవెలబోతున్న ఎర్ర కాల్వ
చింతలపూడి : ఈ ఏడాది మెట్ట ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎర్ర కాల్వ వెలవెలబోతోంది. చింతలపూడి మండలం శెట్టివారిగూడెం వద్ద మేడవరపు చెరువు అలుగు నీరు ప్రవహించేదే ఎర్రకాల్వ. ఇక్కడి నుంచి సుమారు 21 కి.మీటర్లు ప్రవహించి ఎర్రకాల్వ ప్రాజెక్టులో కలుస్తుంది. సుమారు 350 ఎరకాల విస్తీర్ణం కలిగి ఉన్న మేడవరపు చెరువు కింద సుమారు 2 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఒకప్పుడు ఎర్రకాల్వ అంటే పొలాలను ముంపునకు గురిచేసే మహమ్మారి అని రైతులంతా భయపడేవారు. 1998లో అప్పటి రాష్ట్ర మంత్రి కోటగిరి విద్యాధరరావు సుమారు రూ.4.11 కోట్ల నిధులు మంజూరు చేయించి కాల్వను 17.5 కి.మీటర్లు అభివద్ధి చేశారు. అప్పటి నుంచి రైతులకు ముంపు బాధ తప్పింది. రానురాను మెట్ట ప్రాంతంలో వర్షాభావ పరిస్ధితుల కారణంగా ఎర్రకాల్వ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
మినీ ప్రాజెక్టుగా మార్చాలని డిమాండ్
మేడవరపు చెరువును అభివృద్ధి చేసి మినీ ప్రాజెక్టుగా మార్చాలని ఇక్కడి రైతులు ఎప్పటినుంచో కోరుతున్నారు. వరదల సమయంలో ఎర్రకాల్వ నీరు కిందికి ప్రవహించి ఇక్కడి రైతులకు ఉపయోగపడటం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం చెక్ డ్యామ్‌లు కట్టినా భూగర్భ జలాలు పెరిగి మెట్ట ప్రాంతానికి కొంతవరకు ఉపయోగం ఉంటుందని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎర్రకాల్వకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరద నీరు వృథాగా కిందకు పోయింది. వచ్చే వేసవిలో నైనా చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అలాగే మేడవరపు చెరువు ఆక్రమణలు తొలగించి చెరువును అభివృద్ధి చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మేడవరపు చెరువును అభివృద్ధి చేయాలి
ప్రభుత్వం మేడవరపు చెరువు పూడికను తొలగించి అభివృద్ధి చేయాలి. ఎర్రకాల్వ నీరు కిందికి పోకుండా ఎక్కడికక్కడ చెక్‌డ్యాంలు నిర్మించాలి. కాల్వ నీరు రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఎర్ర కాల్వ అభివృద్ధికి నిధులు కేటాయించాలి.
– చేపూరి ఖాదర్‌బాబు, రైతు, వైఎస్సార్ సీపీ నాయకులు, శెట్టివారిగూడెం

వెలవెలబోతున్న ఎర్ర కాల్వ