
రైళ్లలో ప్రత్యేక తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోకి గంజాయి, మత్తుపదార్థాలు రవాణా కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఏర్పాటు చేశామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఈగల్ ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో ఏలూరులో పోలీస్, రైల్వే పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి రైలులో తనిఖీలు చేశారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు రవాణా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
విద్యుత్ రెవెన్యూ అధికారిగా బాధ్యతల స్వీకరణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈపీడీసీల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని ఏలూరు డివిజన్ విద్యుత్ అసిస్టెంట్ రెవెన్యూ అధికారిగా టీ.వెంకాయమ్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం డివిజన్‌లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకాయమ్మకు ఇటీవల సంస్థ సీఎండీ ఏఏఓగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.