
కూటమిలో కుట్టు రగడ
సాక్షిప్రతినిధి,ఏలూరు: కూటమి పార్టీలో కుట్టుమెషీ న్ల పంచాయితీ షురూ అయ్యింది. బీసీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి 3 వేల కుట్టుమెషీన్లు పంపిణీకి సిద్ధం చేశారు. ఈ క్రమంలో తమ పార్టీలకు వాటా ఇవ్వాలని జనసేన, బీజేపీ నేతలు నియోజకవర్గాల్లో కోరుతుంటే మొత్తం తమకే లేదంటే ఇచ్చిన నాలుగైదు తీసుకోండి అంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేయడంతో పల్లెల్లో రగడ మొదలైంది. ఇప్పటికే కూటమి పార్టీలో పదవుల పందారాలు, అక్రమ గ్రావెల్ దందా అన్నింటిలోనూ వాటాల విషయంలో ఘర్షణ కొనసాగడంతో పాటు ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ముఖ్యుల వద్ద సెటిల్‌మెంట్లు జరిగినా పరిష్కారం కాని పరిస్థితి. ఈ తరుణంలో కుట్టుమెషీన్ల వ్యవహారం మరోసారి అలజడి రేపింది.
రూ.60 కోట్లకు పైగా పక్కదారి
బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టుమెషీన్ల పంపిణీ పేరుతో సర్కారు భారీ స్కామ్‌కు తెరతీసింది. రూ.4 వేల నుంచి రూ.5 వేలు విలువ చేసే కుట్టుమెషీన్, 45 రోజుల శిక్షణ అన్నీ కలిపి ఒకరికి రూ.21,500లు ధరగా నిర్ణయించారు. మెషీన్ ఖరీదు రూ.5 వేలు కాగా 75 శాతానికిపైగా స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా కుట్టుమెషీన్ల శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాయి. లేదంటే శిక్షణకు మనిషికి రూ.2 వేలకు మించి తీసుకోరు. అయితే ప్రభుత్వం ఏకంగా ఒక లబ్ధిదారుకు రూ.21,500 చొప్పున ఉమ్మడి జిల్లాలో రూ.90.30 కోట్లు ఖర్చుగా చూపించారు. దీనిలో సుమారు రూ.60 కోట్లకుపైగా పక్కదారి పట్టే అవకాశం ఉంది. గత నెలలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించి ఏప్రిల్ 25 వరకు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు ఎంపీడీఓల ద్వారా బీసీ కార్పొరేషన్‌కు అందుతాయి. అర్హులను ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసి 45 రోజులు శిక్షణ ఇచ్చి అందులో 75 శాతం హాజరు ఉంటేనే లబ్ధిదారులకు మెషీన్లు పంపిణీ చేసేలా నిబంధనలు రూపొందించారు.
ఎమ్మెల్యే చెబితేనే ఫైనల్
ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎంపీడీఓ కార్యాలయాలకు చేరిన దరఖాస్తులను ఎమ్మెల్యే కా ర్యాలయంతో సంప్రదించడం, లేదంటే జాబితా ఎ మ్మెల్యేకు పంపి వాళ్లు ఫైనల్ చేసిన వాటినే ఆమోదిస్తున్నారు. అది కూడా మండల, గ్రామ నాయకులు చెప్పిన వారికే ఇస్తూ జనసేన, బీజేపీ నాయకులను విస్మరిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నచోట అయితే కనీసం ఆ పార్టీ వారిని నామమాత్రంగా పట్టించుకోని పరిస్థితి. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నరసాపురంలో రెండు పార్టీల ముఖ్యుల మధ్య తర్జనభర్జనలు, వివాదాలు కొనసాగుతున్నాయి. పోలవరం, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపు రంలో జనసేన ఎమ్మెల్యేలున్నా టీడీపీ నేతలే మండల, గ్రామస్థాయిలో తమకు యూనిట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏలూరు, దెందులూరు, చింతలపూడి, నూజివీడు, తణుకు, పాలకొల్లు వంటి నియోజకవర్గాల్లో జనసేనకు అతికష్టం మీద ఐదో, పదో యూనిట్లు కేటాయిస్తున్నారు. జిల్లాలో 40 శాతం జనసేన నాయకులు చెప్పిన వారికి రావాల్సి ఉన్నా ప్రతిచోటా టీడీపీ ఉద్దేశపూర్వకంగా తమను విస్మరిస్తుందని ఇన్‌చార్జి మంత్రికి జనసేన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
పల్లెల్లో కుమ్ములాట
ఉమ్మడి జిల్లాకు 42 వేల కుట్టుమెషీన్లు
నియోజకవర్గానికి 3 వేల యూనిట్ల మంజూరు
ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్ అంటూ అధికారుల పరోక్ష ఆదేశాలు
సింహభాగం తమకే అంటున్న టీడీపీ వర్గాలు
జనసేన, బీజేపీకీ వాటా కావాలంటూ పంచాయితీలు
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోటా టీడీపీకే ప్రాధాన్యం
దరఖాస్తుల దశలోనే తీవ్రమవుతున్న రగడ