
పెళ్లింట్లో విషాదం
విద్యుదాఘాతంతో వధువు తండ్రి మృతి
కామవరపుకోట: ఇంకా ఒక్కరోజులో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో వధువు తండ్రి హఠాన్మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, తడికలపూడి ఎస్సై చెన్నారావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలో ఆడమిల్లి గ్రామానికి చెందిన మెతుకుమిల్లి వెంకటేశ్వరరావు (46)కు గ్రామ శివారు మద్దుకూరులో 3 ఎకరాల పామాయిల్ తోట ఉంది. బుధవారం ఉదయం పామాయిల్ తోటలో కత్తి కట్టిన ఇనప రాడ్డుతో ఆయిల్‌పామ్ మట్టలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రైతులు గమనించి బంధువులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై చెన్నారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావుకు భార్య వేణు, ఇద్దరు కుమార్తెలు. రెండవ కుమార్తెకు గురువారం వివాహం జరగాల్సి ఉండగా ముందురోజు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం
ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. తరుణి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. బస్సు కండీషన్ సరిగా లేకపోవడంతో రాత్రంతా మధ్యమధ్యలో ఆపుతూ ప్రయాణికులకు నరకం చూపారు. తెల్లవారుజామున ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌గేట్ వద్దకు వచ్చిన తరువాత ఒక రెస్టారెంట్ వద్ద డ్రైవర్ బస్సును నిలిపివేసి ఇక ఈ బస్సు బయలుదేరదని, ప్రయాణికులు ఎవరిదారిన వారు విశాఖపట్నం వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. అయినప్పటికీ నిర్వాహకులు స్పందించకపోవడంతో దాదాపు 5 గంటల పాటు ప్రయాణికులు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం స్పందించి ట్రావెల్స్ యాజమాన్యంతో చర్చించి 30 మంది ప్రయాణికులకు టికెట్ చార్జీలు చెల్లించే ఏర్పాటు చేశారు. దీనితో పాటు వారికి ఆహారాన్ని కూడా అందించారు. అనంతరం ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణమయ్యారు. ఈ ఘటనపై తరుణి ట్రావెల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు డీటీసీ కరీమ్ తెలిపారు.