
సోషల్ ఆడిట్‌కు హాజరైన ఉపాధ్యాయులు
నూజివీడు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన చర్యలను చేపట్టారు. నాడు–నేడు ఒకటో విడత, రెండో విడతల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించడంతో పాటు నూతన భవనాలను సైతం నిర్మిస్తున్నారు.
అలాగే జగనన్న విద్యాకానుక కిట్ల పేరుతో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, షూలు, సాక్స్, బ్యాగ్‌లు, బెల్టులు తదితర వాటిని అందజేస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో జగనన్న గోరుముద్ద పేరుతో మరింత పోషకాహారాన్ని ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తోంది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో సామాజిక తనిఖీపై ఒక రోజు శిక్షణ తరగతులను పూర్తిచేశారు. ఈనెల 29 నాటికి పాఠశాల స్థాయిలో సమగ్ర నివేదికను తయారు చేసేందుకు హెచ్‌ఎంలు నిగ్నమయ్యారు.
పాఠశాలల్లో సామాజిక తనిఖీ ముఖ్యోద్దేశం
పాఠశాలల అభివృద్ధిలో ప్రజల, తల్లిదండ్రుల, తల్లిదండ్రుల కమిటీ సభ్యుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని పెంచడమే సామాజిక తనిఖీ ముఖ్యోద్దేశం. సామాజిక తనిఖీలో భాగంగా పాఠశాలకు చెందిన భౌతిక, మౌలిక వసతులు, నిధుల విడుదల, ఖర్చుల వివరాలు, ఉపాధ్యాయులు పనితీరు, విద్యార్థుల హాజరు, ప్రగతి, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపస్తకాలు, లింగ వివక్షత, పాఠశాల భద్రత తదితర అంశాలపై తనిఖీ చేస్తారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడం, బాలికా విద్యను ప్రోత్సహించడం, బాలికలకు భద్రత కల్పించడం చేస్తారు. అంతేగాకుండా సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలకు ప్రతిఏటా మంజూరైన నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను గోడపై విద్యా సంవత్సరాల వారీగా ప్రదర్శించాలి.
బడి బలోపేతానికి నిధులు
పాఠశాలల్లో ఇప్పటివరకు చేపట్టిన కార్యకలాపాలను పరిశీలించడంతో పాటు భవిష్యత్‌లో ఏ మేరకు పనులు చేపట్టాలనేది పేరంట్స్ కమిటీల భాగస్వామ్యంతో సమగ్ర ప్రణాళికను తయారు చేస్తారు. ఇందుకోసం పాఠశాల స్థాయిలో యూ డైస్ కోడ్ ఆధారంగా ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టనున్న కార్యక్రమాలకు ఏ మేరకు నిధులు అవసరమనేది సమగ్ర నివేదిక రూపొందిస్తారు. దీని ప్రకారమే ఆయా పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయి.
చాలా మంచి కార్యక్రమం
పాఠశాలల సోషల్ ఆడిట్ అనేది మంచి కార్యక్రమం. దీని వల్ల పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరగడంతో పాటు పనిచేసే ఉపాధ్యాయ సిబ్బందిలో జవాబుదారీ తనం సైతం పెరుగుతుంది. పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక తయారీలో కూడా తల్లిదండ్రుల పాత్రను కూడా ఉంచడం వల్ల వాస్తవ విషయాలు వారికి కూడా తెలుస్తాయి. ప్రతి విషయం పారదర్శకంగా ఉంటుంది.
– వీవీఎస్‌ఆర్ ప్రసాద్, స్టేట్ రిసోర్స్ పర్సన్
