
ఏ ఫిర్యాదు వచ్చినా, ఎలాంటి సమస్య ముంచుకొచ్చినా తక్షణం స్పందించాల్సిన బాధ్యతల్లో ఉన్నవారు మౌనంగా ఉండిపోతే అనుమానాలు బలపడతాయి. అలాంటివారి తటస్థత ప్రశ్నార్థకమవుతుంది. నిరుడు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లొసుగులపై అప్పట్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. కానీ ఎన్నికల సంఘం(ఈసీ) నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. ఏడాదికాలం గడిచాక ఎట్టకేలకు గురువారం ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఆ ఫిర్యాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల వివరణల్ని విన్నారు.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల నిర్వహణ లోపరహితంగా ఉండాలి. అనుమానాలకు తావీయకూడదు. కానీ ఏపీలో ఆద్యంతమూ అందుకు విరుద్ధంగా నడిచింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మొదట్లోనే కూటమి నాయకులు ఫిర్యాదు ఇవ్వటం తడవుగా జిల్లాల్లో ఉన్నతాధికారుల్ని మార్చారు. అయిదేళ్లుగా అమలవుతున్న పథకాలను సైతం ఆపేయాలని ఆదేశించారు. నిర్ణయం తీసుకునేముందు కనీసం కూటమి నేతల ఆరోపణలకు ఆధారాలున్నాయో లేదో చూసుకోవాలన్న స్పృహ కూడా లేకపోయింది. ఫలితంగా అలాంటి జిల్లాల్లో పోలింగ్ రోజున ఎన్ని అవకతవకలు చోటుచేసుకున్నాయో మీడియా సాక్షిగా బయటపడింది.
చాలా గ్రామాల్లో బడుగు వర్గాల్ని ఓటేయకుండా భయభ్రాంతులకు గురిచేశారు. వారి దౌర్జన్యాలకు అనేకమంది తలలు పగిలాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొంపా గోడూ వదిలి చెట్లల్లో పుట్టల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అటు తర్వాత ఇక ఎదురులేదనుకుని ఈవీఎంలను దొంగవోట్లతో నింపేశారు. వీటిపై ఏ క్షణానికాక్షణం ఫిర్యాదులు వెల్లువెత్తినా దిక్కులేకుండా పోయింది. పోలైన నాలుగు కోట్లకుపైగా ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 తర్వాతే పడ్డాయి. ఇదంతా మాయాజాలం అనిపించదా?
ఎన్నికలు ముంగిట్లోకొచ్చాక ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై వదంతులు వ్యాపింపజేసినా ఈసీలో వెంటనే కదలిక లేదు. అటు తర్వాత చంద్రబాబు, లోకేష్‌లపై కేసుపెట్టాలని ఆదేశించారు సరే... దాని అతీగతీ ఏమిటో ఎవరికీ తెలియదు. వేరే రాష్ట్రాల్లో విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని ఏమైనా అంటే నొచ్చుకుని వెనువెంటనే చర్యలకు ఉపక్రమించిన ఈసీ... అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టాలని బాబు నోరు పారేసుకున్నా చోద్యం చూసింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే లెక్కింపు నాడు వెల్లడైన వైపరీత్యాలకు అంతూ దరీ లేదు. పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య భారీ వ్యత్యాసాలున్నాయి. నిరుడు మే నెల 13న రాత్రి 8 గంటలకు ఏపీ పోలింగ్ శాతం 68.12 అని ఈసీ ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి 76.50 శాతమన్నారు. మరో నాలుగు రోజులకల్లా అది 80.66 శాతం అని మాట మార్చారు. మొదట, చివరి ప్రకటనల్లోని అంకెల మధ్య 12.5 శాతం తేడా ఉంది. గతంలోనూ మారిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఈ తేడా ఒక శాతంకన్నా ఎప్పుడూ ఎక్కువ లేదు.
పర్యవసానంగా సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది 87 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించింది. అంతేనా... పోలింగ్ ముగిసిన రోజున ఈవీఎంలలో ఉన్న చార్జింగ్ శాతం కౌంటింగ్ రోజుకు అమాంతం పెరిగింది. పదో, పదిహేను శాతమో చార్జింగ్ ఉన్నట్టు కనబడింది కాస్తా 98 శాతానికి ఎగబాకింది. రీచార్జబుల్ బ్యాటరీలు కనుక అలాంటిది జరగదని చెప్పటం తప్ప ఈసీ దగ్గర సంతృప్తికరమైన జవాబు లేకపోవటం దిగ్భ్రాంతికరం.
బాహాటంగా బయటపడిన ఇలాంటి అవకతవకల పర్యవసానంగానే ఈవీఎంలలోని ఓట్లూ, వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్యనూ లెక్కేసి, అవి ఒకదానితో ఒకటి సరిపోయాయో లేదా తేల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ ఫుటేజ్‌లు ఇవ్వాలని కూడా కోరింది. ఇవేమీ గొంతెమ్మ కోరికలు కాదు. నదురూ బెదురూ లేకుండా కూటమి నేతలు తిమ్మిని బమ్మి చేసిన పర్యవసానంగానే వైఎస్సార్ కాంగ్రెస్ ఈ డిమాండ్లు చేసింది.
తమ నిర్వాకం కళ్లముందు కనబడుతున్నప్పుడు మొండిగా అవేమీ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పటం ప్రజాస్వామికమేనా? అసలు సీసీ టీవీ ఫుటేజ్‌లూ, వీవీ ప్యాట్‌లూ ఎందుకొచ్చాయో, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఎన్నికల ప్రక్రియలో వాటిని చేర్చాల్సివచ్చిందో సీఈసీకి, మరో ఇద్దరు కమిషనర్లకూ తెలుసా? ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలు అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు వాటిని నివృత్తి చేయటం వారి బాధ్యత కాదా? కనీసం హేతుబద్ధమైన జవాబైనా ఇచ్చే ప్రయత్నం చేయొద్దా?
ఈసీ తీరు దేవతా వస్త్రాల కథను తలపిస్తోంది. కోట్లాది రూపాయలు వ్యయం చేసి సీసీ కెమెరాలూ, వీవీ ప్యాట్‌లు సమకూర్చుకోవటం, వాటిని ఉపయోగంలోకి తీసుకురావటం– తీరా రాజకీయ పార్టీలు సందేహం వెలిబుచ్చినప్పుడు వెల్లడించటం కుదరదని మొండికేయటం, నిబంధనలు ఒప్పుకోవనటం ఏం నీతి? పారదర్శకత లేని ఎన్నికలు జరపటం ఎవర్ని ఉద్ధరించటానికి? ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలకూ శిరోధార్యం రాజ్యాంగం. అది నిర్దేశించిన ప్రకారం నడుచుకోవాలి తప్ప ఇతరేతర ప్రభావాలకు లోను కాకూడదు.
మళ్లీ బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్ సర్వత్రా వినిపించటానికి తమ నిర్వాకం కూడా కారణమని ఈసీ తెలుసుకోవాలి. ఈసీ తటస్థతపై తలెత్తుతున్న సందేహాల కారణంగానే ఇప్పుడు బిహార్‌లో ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితాల నవీకరణకు చేస్తున్న ప్రయత్నాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికైనా ఈసీ వైఖరి మారాలి. పారదర్శకంగా వుండే ప్రయత్నం చేయాలి.