ఈ యుద్ధం ఓ వరం! | Sakshi
Sakshi News home page

ఈ యుద్ధం ఓ వరం!

Published Sun, Jun 18 2023 2:07 AM

Sakshi Editorial By Vardhelli Murali On Andhra Pradesh Politics

యుద్ధం అనాగరికం. అమానుషం. యుద్ధం ఒక విధ్వంసం. అది వినాశనానికి విశ్వరూపం. ఆయుధాలతో చేసేది మాత్రమే యుద్ధం కాదు. అధికార బలంతో చేసేది కూడా యుద్ధమే! అధికారం రాజకీయం మాత్రమే కానక్కరలేదు. ఆర్థికం కూడా! సామాజికం, సాంస్కృతికం కూడా! ఈ అంశాల్లో ఆధిపత్యం చలాయించేవాళ్లు సంఘంలో గుప్పెడుమంది మాత్రమే ఉండ వచ్చు.

వారినే పెత్తందార్లని అంటున్నాము. విశాలమైన సామా న్యుల సమూహం మీద పెత్తందార్లు స్వారీ చేయడం కొత్త విషయం కాదు. ఆర్థిక – సామాజిక – సాంస్కృతిక ఆధిపత్యం అతి ప్రమాదకరమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని చూసి మెజా రిటీ ప్రజలు ఝడుస్తూ జీవిస్తారు. ఇటువంటి స్థితినే కొందరు దోపిడీ అన్నారు. పీడన అన్నారు. అణచివేత అన్నారు.

అణచివేతకు గురయ్యేవాడికి యుద్ధం కంటే కొన్నిసార్లు జీవితమే బీభత్సంగా కనిపిస్తుంది. తన జీవితం మీద ఎవరో దండయాత్ర చేస్తున్నట్టూ, దురాక్రమణ చేస్తున్నట్టూ అనిపిస్తుంది. జీవన్మృత్యువేదన గుండెలో కెలుకుతుంది. ఇంతకంటే చావోరేవో తేల్చే సాయుధ రణమే జీవన బృందావనంగా మదిలో మెదులుతుంది. స్పార్టకస్‌ కాలం నుంచి రెండువేల సంవత్సరాల మానవ ప్రస్థానంలో ఇటువంటి సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అప్పుడు యుద్ధంలో విధ్వంసం కాదు, విముక్తి కనిపిస్తుంది. యుద్ధం ఓ వరంలా తోస్తుంది.

సిద్ధాంతపరంగా చూస్తే ప్రజలే ప్రభువులుగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలో అణచివేత ఉండకూడదు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమనే నిట్టూర్పులు వినిపించకూడదు. నిరాశలు వ్యాపించకూడదు. సర్వమానవ సమతా పత్రాన్ని రాజ్యాంగంగా తలదాల్చిన భారతదేశంలో ఈపాటికే అసమానతలు తగ్గుముఖం పట్టి ఉండాలి.

పెత్తందారీ భావజాలం మ్యూజియాల్లోకి చేరి ఉండాలి. కానీ అలా జరగ లేదు. ఆర్థిక అసమానతలు వెయ్యి రెట్లు పెరిగాయి. ఐక్యరాజ్య సమితి, ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థల నివేదికలు ఈ విష యాన్ని కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. సాంఘిక వివక్ష మరింత ఘనీభవించింది. అట్టడుగు వర్గాల ప్రజలు జారుడు మెట్ల మార్గంలో ప్రయాణిస్తున్నారు. అగ్రవర్ణ పేదలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. 

రాజ్యాంగ ఆశయాలను మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు నెరవేర్చలేకపోతున్నది? కారణం... వ్యవస్థల మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. ఈ ఉడుంపట్టు నుంచి వ్యవస్థ లను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నాలు పలుమార్లు జరిగాయి. జాతీయ స్థాయిలో పండిత్‌ నెహ్రూ కాలంలోనే కొన్ని ప్రయ త్నాలు జరిగాయి. కానీ, అప్పటికింకా మన వ్యవస్థలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పెత్తందారీ వర్గ ప్రయోజనాలపై ఇందిరమ్మ కొంత గట్టి పోరాటమే చేశారు.

ఈ వర్గాలన్నీ కలిసి ఎదురు దాడికి దిగడంతో వారిని ప్రతిఘటించడం కోసం ఆమె నియంతగా ముద్ర వేసుకోవలసి వచ్చింది. విశ్వనాథ ప్రతాప్‌ సింగ్‌ ఇదే పనిలో విఫలమై పదవీచ్యుతుడయ్యారు. వివిధ రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కొన్ని ఇటువంటి ప్రయత్నాలు జరి గాయి. ఆ మేరకు పేద ప్రజలు కొంత ముందడుగు వేశారు. పేద వర్గాల కోసం నిలబడిన కారణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి జనప్రియ నాయకులయ్యారు. కానీ, వారు పెత్తందారుల కంటగింపునకు గురికావలసి వచ్చింది.

ఎన్టీ రామారావును పదవీచ్యుతుని చేసిన పెత్తందారీ శక్తులే, రాజశేఖరరెడ్డిని ఓడించడానికి మహాకూటాలు కట్టి విఫలమైన శక్తులే, ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిపై ఓ మహా కుట్రను నడుపుతున్నాయి. పెత్తందారీ వర్గాల బెదిరింపులను లెక్కచేయకుండా జగన్‌ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడటం, రాజ్యాంగ ఆశయాల అమలుకు పూనుకోవడమే ఇందుకు కారణం. ఈ ప్రస్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఓ రోల్‌ మోడల్‌గా మారింది.

పేద వర్గాల అభ్యున్నతికి, మహిళల సాధికారతకు ఇంత విస్తృతంగా, ఇంత బహుముఖంగా గతంలో ఎన్నడూ ప్రయత్నాలు జరగలేదు. ఈ ప్రయత్నాలు ఇలానే కొన సాగితే రానున్న నాలుగైదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక, రాజకీయ పొందికలో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల అక్కడి పెత్తందారీ వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రత్యక్షంగా, పేదవర్గాల ప్రజలపై పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించాయి.

ఈ యుద్ధాన్ని పేదవర్గాలు కూడా స్వాగతిస్తు న్నాయి. పెత్తందార్లను ఓడించడానికి ఇది ఆఖరి మోకాగా వారు భావిస్తున్నారు. ఇక్కడ పెత్తందార్లెవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినవారే! వారు రాజశేఖరరెడ్డిపై దుష్ప్రచారాలు చేసి అడ్డు తొలగించుకోవాలని చూసినవారే! వారు చంద్రబాబు, రామోజీ అండ్‌ కో ముఠా సభ్యులే! తనను గెలిపిస్తే జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న కార్యక్రమాలన్నీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు కదా! మరి పెత్తందారీవర్గ ప్రతినిధి ఎలా అవుతాడని కొందరి ప్రశ్న. పులి తన మచ్చల్ని దాచుకోలేదు. పెత్తందార్లు వారి స్వభావాన్ని మార్చుకోలేరు.

చంద్రబాబు తొలి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల చేటుకాలం కథ తెలిసిందే. రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వకూడదని వాదించిన సంగతి జ్ఞాపకమే. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు ప్రజల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చిన సంగతి గుర్తే. వ్యవ సాయం దండగని చెప్పడం – రైతుల్ని పిట్టల్లా కాల్చిచంపడం మరిచిపోలేని మహావిషాదం. పదేళ్ల విరామం తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయన పెత్తందారీ స్వభావం మారలేదు. పైపెచ్చు మరింత ముదిరింది.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్ని మీడియా సమా వేశాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ‘ఎస్‌సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బాహాటంగా ప్రశ్నించిన మహానాయ కుడు ఆయన. ఎస్‌సీలు, ఎస్‌టీలు, బీసీలు దిగువశ్రేణి పౌరులనే భావన నరనరాన జీర్ణించుకొనిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఆయనది.

‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ ఇది మరో మీడియా సమావేశంలో సీఎం హోదాలో బాబు పేల్చిన డైలాగ్‌. దాని అర్థమేమిటంటే మగపిల్లాడిని కనడం అనేది గొప్ప విషయం. అంత గొప్ప పని కోడలు చేస్తానంటే అత్త ఎందుకు వద్దంటుందని చెప్పడం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మగపిల్లాడెక్కువ, ఆడపిల్ల తక్కువ అనే పురుషాహంకార భావజాలాన్ని వెదజల్లవచ్చునా?

పెత్తందార్లకుండే మరో అలంకారం పురుషాహంకారం కూడా! పేద వర్గాల సాధికారతే కాదు మహిళల సాధికారత కూడా వారికి ఆమోదయోగ్యం కాదు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరి నుంచి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు, ‘మనసులో మాట’ పుస్తకంలో ఆయన పొందు పరుచుకున్న ఐడియాలజీ, చివరి దఫా పదవీకాలంలో తీసు కున్న విధాన నిర్ణయాలూ, వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నీ ఆయన పెత్తందారీ స్వభావాన్నీ, పెత్తందార్ల తాబేదారు పాత్రను చాటిచెబుతూనే ఉన్నాయి.

ఒక్క ఉదాహరణ చాలు... అమరా వతి శాసన రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు వ్యాజ్యాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. పేద వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కూడా కోర్టులో వాదించారు. బీసీలు, ఎస్‌సీలు, ఎస్‌టీలు అక్కడ చేరితే రాజధానికి గౌరవ భంగమట! ఇది పేదల ఆత్మగౌరవాన్నీ, రాజ్యాంగ ప్రతిష్ఠనూ అవమానపరచడంతో సమానం.

పెత్తందారీ రాజకీయ బంటుగా వ్యవహరిస్తున్న చంద్ర బాబుకు గురుపాదుల వారు రామోజీరావు. ఈయన చట్ట విరుద్ధంగా జనం నుంచి డిపాజిట్లు వసూలు చేసి వారి సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైనాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎదుటివారికి చెప్పేటందుకే శ్రీరంగనీతులు తప్ప తాము ఎక్కడ దూరినా తప్పులేదని బలంగా నమ్మే వ్యక్తిత్వం ఈయనది. రెండు రాష్ట్రాల్లోని పెత్తందారీ శక్తులకు వీరిద్దరూ జాయింటుగా నాయకత్వం వహిస్తు న్నారు.

వీరి టీమ్‌లో కొత్తగా చేరిన వ్యక్తి – సినీనటుడు పవన్‌ కల్యాణ్‌. ఈయన ద్వంద్వ ప్రమాణాల మీద ఇప్పటికే బోలెడు జోకులున్నాయి. కమ్యూనిస్టు విప్లవకారుడైన చేగువేరాను కొంత కాలం అనుసరించారు. ఆ తర్వాత జనసంఘ్‌ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్‌ ముఖర్జీపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ముప్పయ్‌ సీట్లయినా రాలేదు, తనకెవరు ముఖ్య మంత్రి పదవి ఇస్తారని కొన్నాళ్లు నిర్వేదం వ్యక్తం చేస్తారు. నెల తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటారు.

ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే తన లక్ష్యమని ప్రకటించి తన రాజకీయ స్థాయి ఏమిటో ఆయన చెప్పకనే చెప్పారు. ఇంట ర్మీడియట్‌లో తాను చదివిన గ్రూపు గురించి నాలుగు  సంద ర్భాల్లో నాలుగు రకాలుగా చెప్పారు. ఇటువంటి ‘అపరిచితుడు’ మోడల్‌ను రాజకీయ నాయకునిగా జనం అంగీకరించరు. వారు తమ నాయకుడి నుంచి నీతిని, నిజాయితీని, పారదర్శకతను కోరుకుంటారు. పుస్తకాలను తెరిచి పట్టుకొని ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటే చాలదు. జీవితాన్ని తెరిచిన పుస్తకంలా మలుచుకుంటేనే ప్రయోజనం నెరవేరుతుంది.

అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని అమలుచేయడానికీ, పేద ప్రజల అభ్యున్నతికీ తొలిమెట్టు పరిపాలనా వికేంద్రీకరణ. ఫలితంగా పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు పరిపాలనపై అవగాహన పెరుగుతుంది. తమ కళ్ల ముందటే ఉన్న ప్రభు త్వాన్ని వారు ఎప్పుడైనా ప్రశ్నించగలుగుతారు. తమకు అంద వలసిన పథకాలు, సేవల విషయంలో పెత్తందార్ల జోక్యం తొలగిపోతుంది.

అందుకని వికేంద్రీకరణకు పెత్తందార్లు వ్యతి రేకం. చంద్రబాబు పద్నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక కొత్త జిల్లాను కానీ, మండలాన్ని కానీ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఎన్టీ రామారావు మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత, పాలనను మరింత వికేంద్రీకరించి పల్లెపల్లెనా సచివా లయాలు స్థాపించి వికేంద్రీకరణను చివరి అంచుకు చేర్చిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి.

వికేంద్రీకరణతోపాటు మరో ఆరు అంశాలపై ప్రభుత్వం పెట్టిన ఫోకస్‌ ఆ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల తలరాతను మార్చబోతున్నది. నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం ఉచిత విద్య, గడప గడపకూ ప్రజారోగ్యాన్ని ప్రాధ మ్యంగా ప్రకటించుకున్న వైద్యరంగం, వ్యవసాయ రంగంలో రైతును చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్‌బీకే సెంటర్లు, మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాలు – ఇస్తున్న పదవులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగంలో ఉత్తేజాన్ని నింపడం, సుదీర్ఘ సముద్ర తీరాన్ని అభివృద్ధికి ఆలంబనగా మలుచుకోవడానికి పెద్ద ఎత్తున పోర్టులను, ఫిషింగ్‌ హార్బర్లను ఏర్పాటు చేయడం.

వికేంద్రీకరణతో కలిసి ఈ ఏడు ఫోకస్‌ ఏరియాలు గేమ్‌ ఛేంజర్స్‌గా మారబోతున్నాయి. బడుగుల జీవితాలను మార్చ బోతున్నాయి. అందువల్లనే పెత్తందారీ వర్గాలు ప్రకటించిన యుద్ధాన్ని పేద వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఒక్కసారి ఓడిస్తే పెత్తందారీ పీడ విరగడవుతుందని వారు ఆశిస్తున్నారు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement